తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా

4 Mar, 2022 16:50 IST|Sakshi

తమిళనాట రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది. తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ ‘యువ’ మంత్రం జపించింది. అంతేకాదు అతివలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ టైమర్స్‌, యువత, చదువుకున్న వారిని ప్రోత్సహించడంతో డీఎంకేపార్టీ నూతనోత్సాహంతో తొనికిసలాడుతోంది. 

విద్యావంతులకు పెద్దపీట
డీఎంకే తరపున మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారిలో 30 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ఒక డాక్టర్‌ కూడా ఉండటం విశేషం. కాంచీపురం మేయర్‌గా ఎన్నికైన మహలక్ష్మి యువరాజ్‌.. ఇన్ఫోసిస్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివిన ఎన్‌. దినేశ్‌.. తిరుప్పూర్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. అలాగే చెన్నై మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించిన ప్రియా రాజన్‌ కూడా ఎంకామ్‌ చేశారు. తంజావూర్‌ డిప్యూటీ మేయర్‌ అంజుగమ్‌ భూపతి.. ఎంబీబీఎస్‌, ఎండీ చదివారు.

ఆశ్చర్యకర ఎంపిక
కోయంబత్తూర్‌ మేయర్‌గా కల్పనా ఆనందకుమార్‌, చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్‌ను ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ కుటుంబానికి చెందిన 40 ఏళ్ల కల్పన.. కోయంబత్తూర్‌కు తొలి మహిళా మేయర్‌ అయ్యారు. ఆమె స్థానిక డైమండ్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, కల్పన భర్త ఆనందకుమార్‌.. ఈ-సేవ కేంద్రం నిర్వహిస్తూ, మానియాకరంపాళయం ప్రాంత డీఎంకే కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కల్పన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే సమయానికి.. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసేందుకు భర్తతో పాటు ఆమె ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి.

ప్రియా రాజన్‌ రికార్డు
51 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నై మేయర్‌ పీఠాన్ని మహిళ అధిష్టించారు. అంతేకాదు అతిచిన్న వయసులో చెన్నై మేయర్‌గా ఎన్నికైన ఘనత కూడా ప్రియా రాజన్‌(28)కు దక్కింది. చెన్నై నగర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ సామాజిక వర్గానికి మేయర్‌ కుర్చీ సొంతమైంది. తారా చెరియన్(1958), కామాక్షి జయరామన్(1971) తర్వాత చెన్నైకి మూడవ మహిళా మేయర్‌గా ప్రియా రాజన్‌ నిలిచారు. డీఎంకే నుంచి మేయర్లుగా ఎ‍న్నికైన 20 మందిలో 11 మంది మహిళలు ఉండటం విశేషం. 

డీఎంకే మిత్ర ధర్మం
నగర పాలక సంస్థల ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే మిత్రధర్మాన్ని పాటించి కాంగ్రెస్‌కు ఒక స్థానాన్ని కట్టబెట్టింది. కుంభకోణం నగర మేయర్‌ సీటును కాంగ్రెస్‌ పార్టీకి వదిలిపెట్టింది. అంతేకాదు ఆరు డిప్యూటీ మేయర్‌ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. దీంతో కమ్యూనిస్ట్‌, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలకు కూడా పదవులు దక్కాయి. 15 డిప్యూటీ మేయర్‌ స్థానాలకు డీఎంకే పరిమితమైంది. (క్లిక్‌: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా)

స్థాలిన్‌ ముందుచూపు
యువతకు పెద్దపీట వేయడం ద్వారా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ముందుచూపు ప్రదర్శించారు. 20 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించేలా యువ నాయకులను తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో ఏళ్లకు తరబడి పాతుకుపోయిన నాయకులతో పోలిస్తే కొత్త తరంపై వ్యతిరేకత తక్కువ ఉంటుంది. యువతకు అవకాశం కల్పిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతో స్టాలిన్‌.. నగర పాలక సంస్థల్లో వారికి పెద్దపీట వేసి అనుకున్న ఫలితాలు సాధించారు. (చదవండి: చెన్నై మేయర్‌గా ప్రియా రాజన్‌)

- సాక్షి, వెబ్ స్పెషల్‌

మరిన్ని వార్తలు