మెడిసిన్‌ విదేశాల్లోనే ఎందుకు? మన దగ్గరేమైంది ?

3 Mar, 2022 16:48 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఘటన దేశంలో వైద్యవిద్యపై చర్చకు తెర తీసింది. వేల సంఖ్యలో విద్యార్థులు బయటి దేశాలకు వెళ్తుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. లోపాలను సవరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే మౌలిక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

రష్యా సేనలు జరిపిన దాడిలో కర్నాటకు చెందిన నవీన్‌ అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పంజాబ్‌కి చెందిన మరో విద్యా‍ర్థి యు‍ద్ధం కారణంగా సకాలంలో వైద్య సాయం అందక ఉక్రెయిన్‌లోనే ఊపిరి వదిలాడు. మెడిసిన్‌ చదివేందుకు అక్కడికి వెళ్లిన ఎందరో విద్యార్థులు యుద్ధ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణక్షణం భయంభయంగా గడిపారు.

వివాస్పద వ్యాఖ్యలు
ఈ సమయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప‍్రహ్లాద్‌ జోషి చేసిన వ్యాఖ్యలు వివాస్పదమయ్యాయి. విదేశాల్లో మెడిసిన్‌ విద్యను అభ్యసించిన 90 శాతం భారత విద్యార్థులు ఇండియాలో క్వాలిఫైయింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారంటూ ఆయన చేసిన విమర్శలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఉత్తీర్ణత సాధించలేనప్పుడు విదేశాల్లో చదవడం ఎందుకంటూ నిప్పును మరింత రాజేశారు.

కోట్లు ఖర్చు చేయలేం
ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో చనిపోయిన నవీన్‌ తండ్రి స్పందిస్తూ.. నీట్‌ 97 శాతం మార్కులు వచ్చినా... ఇక్కడ కోట్లు పెట్టి చదివించలేకే ఉక్రెయిన్‌ పంపించనంటూ బోరుమన్నారు. దేశంలో మెడికల్‌ కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతేకాదు వైద్య విద్య ఖరీదైనదిగా మారడంతో విదేశాలకు వెళ్లాల్సి వస్తుందంటూ చెబుతున్నాయి. మెడిసన్‌కు సంబంధించి మరింత లోతుల్లోకి వెళితే విస్తగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 2021 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం ఇండియాలో ప్రతీ 1,155 మంది జనాభాకు ఒక డాక్టరు ఉన్నట్టుగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కనీసం ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టరు ఉండాలి. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన కనీస ప్రమాణాలకు కూడా ఆమడ దూరంలో నిలిచింది ఇండియా. 

డిమాండ్‌ అండ్‌ సప్లై
కనీస ప్రమాణాలు అందుకునేందుకు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉన్నా... మన ప్రభుత్వాలు కొత్త వైద్యులు తయారు చేయడంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. 2021 లెక్కల ప్రకారం దేశంలో 83 వేల ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా 16 లక్షల మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు.  

ఖరీదెక్కువ
అందుబాటులో ఉన్న మెడిసిన్‌ సీట్లలో సగానికి పైగా ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వైద్య విద్యకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అనధికారిక ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి కాలేజీలు. ఫలితంగా మెడిసిన్‌ చదవాలంటే కోట్ల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిభ ఉన్నా కోట్లాది రూపాయల ఫీజులు చెల్లించలేక మన విద్యార్థులు విదేశాలకు తరలిపోతున్నారు. 

విదేశాలకు వేల సంఖ్యలో
తాజా వివరాల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను చదవుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా ఉంది. చైనా (23,000), ఉక్రెయిన్‌ (18,000), రష్యా (16,500), ఫిలిప్పీన్స్‌ (15,000), కిర్కిజిస్తాన్‌ (10,000), జార్షియా (7500), బంగ్లాదేశ్‌ (5200), పోలాండ్‌ (4,000), అమెరికా (3000)ల మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. మనకంటే వెనకబడిన దేశమైన బంగ్లాదేశ్‌కి కూడా మన విద్యార్థులు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

ఏటేటా పెరుగుతున్నారు
విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్‌ చేయాలంటే తప్పని సరిగా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. గత ఏడేళ్లుగా ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఇయర్ల వారీగా పరిశీలిస్తే 2015లో 12,116 మంది 2018లో 21,351 మంది హాజరవగా 2021లో అయితే ఏకంగా 35,774 మంది ఎఫ్‌ఎంజీఈ పరీక్షలకు కూర్చుకున్నారు. అంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే విదేశాల్లో డాక్టరు పట్టా పుచ్చుకున్న వైద్యుల సంఖ్య మూడింతలు పెరిగింది. 

తీవ్ర కొరత
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశ జనాభాకు 14 లక్షల మంది డాక్టర్లు అవసరం. కానీ మన దగ్గర రిజిస్ట్రర్‌ అల్లోపతి డాక్టర్ల సంఖ్య 12 లక్షలుగా ఉంది. అంటే ఇప్పటికీ రెండు లక్షల మంది డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాక్టర్లలో అత్యధికం నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఈ కొరత మరింత ఎక్కువగా ఉంటుంది.

మార్పు మొదలైంది
ఇప్పటికైనా కేంద్రం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా వైద్యుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో వైద్య విద్య ఖరీదైన వ్యవహారం కాకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్తగా గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసింది. ఆ తర్వాత తెలంగాణ సైతం ఇది బాట పట్టింది. 

- సాక్షి ప్రత్యేకం

చదవండి: హైదరాబాద్‌లో మరో మెడికల్‌ కాలేజీ? ఆనంద్‌ మహీంద్రా సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు