చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్‌ ఆఖరి మాటలు

11 May, 2021 18:00 IST|Sakshi

తన యూట్యూబ్‌ ఛానల్‌తో లక్షలాది నెటిజన్లను ఆకర్షించిన యువకుడు చివరకు మహమ్మారి కరోనా వైరస్‌కు బలయ్యాడు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే చనిపోయే ముందు అతడు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఆస్పత్రిలో చేరాను.. కానీ సౌకర్యాలు బాగాలేవు. ముక్కుకి ఆక్సిజన్‌ పైపు పెట్టారు. కానీ ఆక్సిజన్‌ రావడం లేదు’ అంటూ శ్వాస కోసం ఇబ్బంది పడుతూ మాట్లాడారు. ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు.

ఢిల్లీకి చెందిన రాహూల్‌ వోహ్ర యూట్యూబర్‌. నటుడిగా కూడా మారాడు. ఇటీవల కరోనా బారిన పడడంతో ఢిల్లీ తహీర్‌పూర్‌లోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అయితే తన భర్త రాహుల్‌ తీసుకున్న వీడియోను ఆయన భార్య జ్యోతి చూసి ‘నా భర్త చనిపోయాడని అందరికీ తెలుసు.. కానీ ఎలా చనిపోయాడో చూడండి’ అంటూ రాహుల్‌ మాట్లాడుతున్న వీడియోను సోమవారం పోస్టు చేసింది.

‘నాకు ఈ రోజు విలువైనది. ఇది (ఆక్సిజన్‌ పైపు) లేకుంటే నేను లేను. ఈ పైపు నుంచి ఆక్సిజన్‌ రావడం లేదు. ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోవడం లేదు. అటెండర్లను పిలిస్తే ఒక్క నిమిషం అని అంటారు. ఇక అటే వెళ్తారు. కొన్ని గంటలైనా రారు. రోగుల పరిస్థితి అర్ధం చేసుకోరు. ప్రతి రాహుల్‌కు న్యాయం జరగాలి’ అంటూ ఆమె హ్యాష్‌ట్యాగ్‌ ప్రారంభించారు. ఈ ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌లో మార్మోగుతోంది. 

దేశంలో ప్రతి రోగి పరిస్థితి రాహుల్‌ మాదిరి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాహుల్‌కు న్యాయం జరగాలని.. మరో రాహుల్‌ బలి కాకుండా చర్యలు చేపట్టాలని ట్వీట్లు చేస్తున్నారు. రాహుల్‌ మృతికి సంతాపం తెలుపుతూనే ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని, బెడ్లు, వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని నెటిజన్లతో పాటు ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: ఇప్పటివరకూ లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాలు ఇవే!

చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

A post shared by Jyoti Tiwari (@ijyotitiwari)

మరిన్ని వార్తలు