పది మంది స్కోర్లను ఒక్కడే కొట్టేశాడు.. విధ్వంసం సృష్టించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌

5 Dec, 2023 09:12 IST|Sakshi

అబుదాబీ టీ10 లీగ్‌ 2023లో ఆసక్తికర గణాంకాలు నమోదయ్యాయి. టీమ్‌ అబుదాబీ, బంగ్లా టైగర్స్‌ మధ్య నిన్న (డిసెంబర్‌ 4) జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాటర్‌ ప్రత్యర్ధి జట్టులోని పది మంది స్కోర్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ అబుదాబీ నిర్ణీత 10 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లా టైగర్స్‌ బ్యాటర్‌, ఇంగ్లండ్‌ యువ ఆటగాడు జోర్డన్‌ కాక్స్‌ ఒక్కడే అజేయమైన 56 పరుగులు (23 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. జోర్డన్‌ చెలరేగడంతో బంగ్లా టైగర్స్‌ 4.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

అబుదాబీ ఇన్నింగ్స్‌లో ఇద్దరు డకౌట్లు కాగా.. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆ జట్టు కెప్టెన్‌ ప్రిటోరియస్‌ (15), 11వ నంబర్‌ ఆటగాడు రయీస్‌ (8 బంతుల్లో 20 నాటౌట్‌; 3 సిక్సర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. రయీస్‌ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోతే అబుదాబీ టీమ్‌ ఈ మాత్రం స్కోర్‌ కూడా చేయలేకపోయేది.

టీమ్‌ అబుదాబీ చేసిన స్కోర్‌లో (65) జోర్డన్‌ కాక్స్‌ ఒక్కడే 90 శాతానికి పైగా పరుగులు (56 నాటౌట్‌) సాధించడం విశేషం. డేనియల్‌ సామ్స్‌ (2-0-11-3), గాబ్రియెల్‌ (2-1-2-2), హోవెల్‌ (2-0-9-2), డొమినిక్‌ డ్రేక్స్‌ (1-0-11-1) బంగ్లా టైగర్స్‌ పతనాన్ని శాశించారు. అబుదాబీ టీమ్‌లో కైల్‌ మేయర్స్‌ (6), అలెక్స్‌ హేల్స్‌ (2), టామ్‌ బాంటన్‌ (0) లాంటి విధ్వంసకర వీరులు ఉన్నా అతి తక్కువ స్కోర్ల్‌కే పరిమితమయ్యారు.   

>
మరిన్ని వార్తలు