లంకతో మూడో వన్డే.. రికార్డు శతకం బాదిన ఆఫ్ఘన్‌ బ్యాటర్‌

1 Dec, 2022 11:59 IST|Sakshi

AFG VS SL 3rd ODI: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం శ్రీలం‍కలో పర్యటించిన ఆఫ్ఘనస్తాన్‌ జట్టు 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు 60 పరుగుల తేడాతో గెలుపొందగా.. వర్షం కారణంగా రెండో మ్యాచ్‌ ఫలితం తేలకుండా రద్దైంది. నిన్న (నవంబర్‌ 30) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిధ్య జట్టు 4 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌ ఓడించడంతో సిరీస్‌ సమంగా ముగిసింది.  

మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. శ్రీలంక జట్టు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిం‍ది. సిరీస్‌ తొలి మ్యాచ్‌లో సెంచరీ బాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇబ్రహీమ్‌ జద్రాన్‌ ఈ మ్యాచ్‌లోనూ భారీ శతకం (138 బంతుల్లో 162; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ సెంచరీ సాధించడం ద్వారా జద్రాన్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. కేవలం 8 వన్డేల్లోనే 3 శతకాలు బాది జోరుమీదున్న 20 ఏళ్ల జద్రాన్‌.. ఆఫ్ఘన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతం‍లో వన్డేల్లో ఆఫ్ఘన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు మహ్మద్‌ షెహజాద్‌ (131) పేరిట ఉండేది.

కాగా, ఈ మ్యాచ్‌లో జద్రాన్‌కు జతగా నజీబుల్లా (77) రాణించినప్పటికీ.. ఆఫ్ఘన్‌ బౌలర్లు భారీ టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోవడంలో విఫలమ్యారు. కుశాల్‌ మెండిస్‌ (67), చరిత్‌ అసలంక (83 నాటౌట్‌), చండీమాల్‌ (33), దసున్‌ షనక (43), దునిత్‌ వెల్లలగే (31 నాటౌట్‌) సంయుక్తంగా రాణించి మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు శ్రీలంక సిరీస్‌ కోల్పోకుండా కాపాడుకోగలిగారు. సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఇబ్రహీమ్‌ జద్రాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కగా.. చరిత్‌ అసలంకకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.   
 

మరిన్ని వార్తలు