ఊరేగింపు... మేళతాళాలు...

22 Jan, 2021 06:00 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్‌ గెలిపించిన కెప్టెన్‌ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే హౌజింగ్‌ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. భార్యతో పాటు రహానే తన రెండేళ్ల కుమార్తెను ఎత్తుకొని నడుస్తుండగా ఇరుగు పొరుగువారు, స్థానికులు అతనిపై అడుగడుగున పూలజల్లు కురిపించారు. అనంతరం రహానేతో కేక్‌ కట్‌ చేయించి వేడుక జరుపుకున్నారు.

అంతకుముందు ముంబై క్రికెట్‌ సంఘం రహానే, రోహిత్‌ శర్మ, శార్దుల్‌ ఠాకూర్, పృథ్వీ షాలను ఘనంగా సన్మానించింది. బ్రిస్బేన్‌ టెస్టు హీరో రిషభ్‌ పంత్‌ ఢిల్లీలో హర్షధ్వానాల మధ్య ఇంటికి చేరుకున్నారు. తమిళ సీమర్‌ నటరాజన్‌కు సొంతూరైన ‘చిన్నప్పంపట్టి’ గ్రామస్థులంతా రథంపై ఊరేగించి బ్రహ్మరథం పట్టారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఊరంతా పాల్గొనడం విశేషం. ఓ నెట్‌ బౌలర్‌గా జట్టుతో పాటు వెళ్లిన ఈ తమిళ తంబి అన్ని ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. కరోనా దృష్ట్యా బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిబంధనల ప్రకారం రహానే, రోహిత్, శార్దుల్, పృథ్వీ, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిలను ఏడు రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌ కావాలని అధికారులు సూచించారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు