ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. టీమిండియా తరఫున కొత్త బౌలర్‌ ఎంట్రీ..?

21 Feb, 2024 21:46 IST|Sakshi

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తరఫున కొత్త బౌలర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. సిరాజ్‌కు జతగా బుమ్రా స్థానంలో ఆకాశ్‌ దీప్‌ తుది జట్టులో ఉంటాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముకేశ్‌ కుమార్‌ కంటే ఆకాశ్‌దీపే బెటర్‌ అని భారత క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. 

ఐపీఎల్‌, దేశవాలీ క్రికెట్‌లో ఆకాశ్‌ దీప్‌ మెరుగైన ప్రదర్శన చేయడమే అభిమానుల ఛాయిస్‌కు కారణంగా తెలుస్తుంది. ఆకాశ్‌ దీప్‌ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున, దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్‌ తరఫున అద్భుతంగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆకాశ్‌దీప్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. 

ఈ ఫార్మాట్‌లో ఆకాశ్‌ ఆడిన 30 మ్యాచ్‌ల్లోనే 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లోనూ ఆకాశ్‌ అదరగొట్టాడు. ఇటీవల బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆకాశ్‌ 10 వికెట్ల ప్రదర్శనతో విజృంభించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. దీనికి ముందు ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌లోనూ ఆకాశ్‌ సత్తా చాటాడు.

ఆ సిరీస్‌లో ఆకాశ్‌ 16.75 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలకు తోడు ముకేశ్‌తో పోలిస్తే ఆకాశ్‌ వేగవంతమైన బౌలర్‌ కావడంతో అతనికే అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

మరోవైపు ముకేశ్‌ కుమార్‌ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నాలుగో టెస్ట్‌ రేసులో వెనుకపడ్డాడు. ముకేశ్‌ విశాఖ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టడంతో మేనేజ్‌మెంట్‌కు సెకెండ్‌ ఛాయిస్‌గా మారాడు.

పై పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆకాశ్‌ దీప్‌ టెస్ట్‌ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖయమనే అనిపిస్తుంది. ఆకాశ్‌ టీమిండియాకు ఎంపిక కావడం ఇది తొలిసారి కాదు. తాజా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. 

కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సీనియర్లు విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ షమీ లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తుంది. 

హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్‌ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుండగా.. ఐదో టెస్ట్‌ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది.


 

whatsapp channel

మరిన్ని వార్తలు