సూపర్‌ లక్ష్య: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి భారత యువతార

20 Mar, 2022 04:13 IST|Sakshi

సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ లీ జి జియాపై సంచలన విజయం

21 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన భారతీయ ప్లేయర్‌గా ఘనత

వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరిస్థితి ఎలా ఉన్నా... తగ్గేదేలే... అంటూ భారత బ్యాడ్మింటన్‌ యువతార లక్ష్య సేన్‌ ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో దూసుకుపోతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా చెలరేగిపోతున్న 20 ఏళ్ల లక్ష్య సేన్‌ ఈ మెగా టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ లీ జి జియా (మలేసియా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్‌ మరో విజయం సాధిస్తే ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన మూడో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌), నాలుగో ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో లక్ష్య సేన్‌ తలపడతాడు.

బర్మింగ్‌హమ్‌: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో లక్ష్య సేన్‌ రూపంలో మళ్లీ ఓ భారతీయ ప్లేయర్‌ టైటిల్‌ బరిలో నిలిచాడు. 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మెగా టోర్నీలో ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 76 నిమిషాల్లో 21–13, 12–21, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్‌ 10–14తో, 12–16తో, 16–18తో వెనుకబడ్డాడు.

కానీ వెనుకంజలో ఉన్నానని ఆందోళన చెందకుండా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్‌ స్కోరు 16–18 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక పాయింట్‌ కోల్పోయిన లక్ష్య సేన్‌ ఆ వెంటనే మరో పాయింట్‌ గెలిచి చిరస్మరణీయ విజయం సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)ను ఓడించిన లీ జి జియా సెమీఫైనల్లో మాత్రం లక్ష్య సేన్‌ ధాటికి కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సౌరభ్‌ వర్మ (భారత్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)పై నెగ్గిన లక్ష్య సేన్‌కు క్వార్టర్‌ ఫైనల్లో చైనా ప్లేయర్‌ లూ గ్వాంగ్‌ జు నుంచి వాకోవర్‌ లభించింది.  

బెంగళూరులోని ప్రకాశ్‌ పదుకొనే బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్య సేన్‌ కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో తనకంటే మెరుగైన ప్లేయర్లను ఓడిస్తూ నిలకడగా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన లక్ష్య సేన్‌ ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్‌ టైటిల్‌ను సాధించాడు. గత వారం జర్మన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

గాయత్రి–త్రిషా జంట ఓటమి
మహిళల డబుల్స్‌ విభాగంలో గాయత్రి గోపీచంద్‌–త్రిషా జాలీ (భారత్‌) జంట పోరాటం ముగిసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో గాయత్రి– త్రిషా జోడీ 17–21, 16–21తో జాంగ్‌ షు జియాన్‌–జెంగ్‌ యు (చైనా) జంట చేతిలో ఓడింది. గాయత్రి–త్రిషా జోడీకి 14 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 64 వేలు) తోపాటు 8,400 పాయింట్లు లభించాయి.
ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన ఐదో భారతీయ ప్లేయర్‌ లక్ష్య సేన్‌. గతంలో పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌నాథ్‌ (1947; రన్నరప్‌), ప్రకాశ్‌ పదుకొనే (1980–విజేత; 1981–రన్నరప్‌), పుల్లెల గోపీచంద్‌ (2001–విజేత)... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ (2015–రన్నరప్‌) ఈ ఘనత సాధించారు.

మరిన్ని వార్తలు