CPL 2023: అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్‌లోనే ఇలా? వీడియో వైరల్‌

24 Aug, 2023 13:47 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్ తరపున కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే రాయుడు నిరాశపరిచాడు. గురువారం జమైకా తల్లావాస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

సెయింట్స్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌ వేసిన సల్మాన్‌ ఇర్షద్‌ బౌలింగ్‌లో రాయుడు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని థర్డ్‌మాన్‌ ఫీల్డర్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఇమాద్‌ వసీం క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో నిరాశతో రాయుడు మైదాన్ని వీడాడు.  అతడు ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో రాయుడు తొలి మ్యాచ్‌లోనే ఇలా జరిగిందేంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా సీపీఎల్‌లో ఆడిన రెండో భారత ఆటగాడిగా రాయుడు నిలిచాడు.

ఇక ఐపీఎల్‌-2023 తర్వాత అన్నిరకాల ఫార్మాట్‌లకు రాయుడు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐదోసారి చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్స్‌గా నిలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో రాయుడు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫైనల్లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఇక సీఎస్‌కే విజయంతో ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టులో భాగమైన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయుడు మొత్తంగా ఆరుసార్లు (ముంబై ఇండియన్స్‌ తరఫున 3, సీఎస్‌కే తరఫున 3)టైటిల్స్‌ సాధించిన జట్లలో రాయుడు భాగంగా ఉన్నాడు. రాయుడు కంటే ముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్‌ శర్మ ముందన్నాడు. ఇక ఐపీఎల్‌లో 203 మ్యాచ్‌లు ఆడిన అంబటి.. 4348 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్‌ కెరీర్‌లో ఒక సెంచరీ ఉంది.
చదవండి: Virat Kohli: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. 

మరిన్ని వార్తలు