పరాజయంతో ముగించిన ఆంధ్ర

4 Dec, 2023 03:56 IST|Sakshi

చండీగఢ్‌: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. ఉత్తరప్రదేశ్‌ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 46.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ కరణ్‌ షిండే (67; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రెడ్డి (37 బంతుల్లో 60 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోన శ్రీకర్‌ భరత్‌ (50 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... పృథ్వి రాజ్‌ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు.

షేక్‌ రషీద్, రికీ భుయ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. ఉత్తరప్రదేశ్‌ బౌలర్లలో కార్తీక్‌ త్యాగి, శివా సింగ్‌ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌ జట్టు 41.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించి గెలిచింది. ఆర్యన్‌ జుయల్‌ (55; 7 ఫోర్లు), సమీర్‌ రిజ్వీ (61 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురెల్‌ (57 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసి ఉత్తరప్రదేశ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఏడు జట్లున్న గ్రూప్‌ ‘డి’లో ఆంధ్ర తమ ఆరు మ్యాచ్‌లను పూర్తి చేసుకొని ఆరు పాయింట్ల తో ఐదో స్థానంలో నిలిచింది. ఒక మ్యాచ్‌లో నెగ్గిన ఆంధ్ర, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్‌ వర్షంవల్ల రద్దయింది.

>
మరిన్ని వార్తలు