హైదరాబాద్‌ జట్టుకు మూడో విజయం

4 Dec, 2023 03:54 IST|Sakshi

జైపూర్‌: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు ఖాతాలో మూడో విజయం చేరింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ వీజేడీ పద్ధతిలో 30 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ (98 బంతుల్లో 102 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించగా... ధ్రువ్‌ షోరే (83; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు.

హైదరాబాద్‌ బౌలర్లలో కార్తికేయ, నితిన్‌సాయి యాదవ్‌ రెండు వికెట్ల చొప్పున తీశారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టు 29 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 159 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. వీజేడీ పద్ధతి ఆధారంగా హైదరాబాద్‌ విజయసమీకరణాన్ని లెక్కించగా హైదరాబాద్‌ 30 పరుగులు ఎక్కువే చేసింది.

దాంతో హైదరాబాద్‌ను విజేతగా ప్రకటించారు. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (77 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ సింగ్‌ (62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. హైదరాబాద్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను మంగళవారం మేఘాలయ జట్టుతో ఆడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

>
మరిన్ని వార్తలు