Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్‌లో అన్‌స్టాపబుల్‌ ఖవాజా!

8 Jan, 2022 12:23 IST|Sakshi

Ashes Series 2021 2022: ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ సాధించి సత్తా చాటాడు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఖవాజా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఖవాజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కరోనాతో మ్యాచ్‌కు దూరమైన ట్రవిస్‌ హెడ్‌ స్థానంలో టీమ్‌లోకి వచ్చాడు. 

ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో రాణించిన ఖవాజా.. నాలుగో రోజు ఆటలో భాగంగా 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. 138 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. కామెరూన్‌ గ్రీన్‌ మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమైన వేళ అద్భుతంగా రాణించి ఆసీస్‌ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇక ఖవాజా బ్యాటింగ్‌ మెరుపుల నేపథ్యంలో 416 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన కంగారూ జట్టు... రెండో ఇన్నింగ్స్‌ను 265 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఇప్పటికే వరుసగా మూడు పరాజయాలతో ట్రోఫీ చేజార్చుకున్న ఇంగ్లండ్‌ పరువు దక్కించుకునేందుకు పోరాడుతోంది. కాగా యాషెస్‌ సిరీస్‌లో ఖవాజా వరుస సెంచరీలను ఉటంకిస్తూ ‘అన్‌స్టాపబుల్‌’అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడిపై ప్రశంసల జల్లు కురిపించింది.

మరిన్ని వార్తలు