Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..

25 Aug, 2022 13:36 IST|Sakshi
సచిన్‌ టెండుల్కర్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి(PC: BCCI)

Asia Cup 2022: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ రెండు రోజుల్లో ఆరంభం కానుంది. దుబాయ్‌ వేదికగా ఆగష్టు 27న శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022కు సన్నాహకంగా భావిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో దుమ్మురేపేందుకు క్రికెటర్లు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దూకుడైన ఆట తీరుతో పరుగుల దాహం తీర్చుకునేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజం, ఫఖర్‌ జమాన్‌ వంటి ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-10 బ్యాటర్లు ఎవరో తెలుసా?

1. సనత్‌ జయసూర్య
శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్యకు ఆసియా కప్‌ టోర్నీలో అద్భుత రికార్డు ఉంది. ఎడమచేతి వాటం గల ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఈ ఈవెంట్‌లో  53.04 సగటుతో 1220 పరుగులు సాధించాడు. 25 మ్యాచ్‌లలో ఈ మేరకు స్కోరు చేశాడు. తద్వారా ఇప్పటి వరకు ఈ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జయసూర్య 2011లో చివరిసారిగా తన అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడాడు.

2. కుమార సంగక్కర
శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర ఆసియా కప్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 1075 పరుగులు చేశాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

3. సచిన్‌ టెండుల్కర్‌
ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ది అగ్రస్థానం. ఈ ఈవెంట్‌లో సచిన్‌ 21 మ్యాచ్‌లలో  51.10 సగటుతో 971 పరుగులు సాధించాడు. అయితే, టోర్నీలో మొత్తంగా సనత్‌ జయసూర్య, సంగక్కర తర్వాతి స్థానం(నంబర్‌ 3)లో నిలిచాడు. 

4. షోయబ్‌ మాలిక్‌
పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌కు ఈ టోర్నీలో మంచి రికార్డు ఉంది. కుడిచేతి వాటం గల ఈ ఆల్‌రౌండర్‌ 21 మ్యాచ్‌లలో 64.78 సగటుతో మొత్తంగా 907 పరుగులు సాధించాడు. 

5. రోహిత్‌ శర్మ
టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఆసియా కప్‌ టోర్నీలో మెరుగైన రికార్డు ఉంది. ఈ ఈవెంట్‌లో 27 మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్‌ 883 పరుగులు సాధించాడు.

6. విరాట్‌ కోహ్లి
టీమిండియా మాజీ సారథి, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 766 పరుగులు సాధించాడు. సగటు 63.83. కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్‌, రోహిత్‌ తర్వాతి స్థానం కోహ్లిదే. ఈ టోర్నీలో కోహ్లి మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు సాధించాడు.

7. అర్జున రణతుంగ
శ్రీలంక మాజీ ఆటగాడు అర్జున్‌ రణతుంగ ఆసియా కప్‌ టోర్నీలో 19 మ్యాచ్‌లలో 741 పరుగులు నమోదు చేశాడు.

8. ముష్ఫికర్‌ రహీం
బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీం ఈ మెగా ఈవెంట్‌లో 26 మ్యాచ్‌లలో 739 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటి వరకు టాప్‌-10లో ఉన్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక బంగ్లా బ్యాటర్‌గా నిలిచాడు.

9. ఎంఎస్‌ ధోని
మిస్టర్‌ కూల్‌, టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి ఆసియా కప్‌ టోర్నీలో మెరుగైన రికార్డు ఉంది. 24 మ్యాచ్‌లు ఆడి 69.00 సగటుతో ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ 690 పరుగులు చేశాడు. 

10. మహేళ జయవర్ధనే
శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ మహేళ జయవర్ధనే 28 మ్యాచ్‌లు ఆడి 29.30 సగటుతో 671 పరుగులు సాధించాడు.

ఇక ఈ మెగా టోర్నీ ఆరంభం నుంచి వన్డే ఫార్మాట్‌లో సాగిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2016లో తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అప్పటి నుంచి ఒక దఫా వన్డే.. మరో దఫా పొట్టి ఫార్మాట్లో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈసారి ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఈవెంట్‌ సాగనుంది. కాబట్టి ఈసారి మెరుగ్గా రాణిస్తే రోహిత్‌ శర్మ, కోహ్లి.. సచిన్‌ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌! భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి.. వీడియో వైరల్‌!
Shubman Gill: గిల్‌ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌కు పయనం కానున్న భారత ఓపెనర్‌!

మరిన్ని వార్తలు