Asia Cup 2022: ఆఫ్గానిస్తాన్‌పై శ్రీలంక ప్రతీకారం తీర్చుకోనుందా..?

3 Sep, 2022 14:11 IST|Sakshi
PC: India Today

ఆసియాకప్‌-2022లో లీగ్‌ దశ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. గ్రూపు-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌ జట్లు అర్హత సాధించగా.. గ్రూప్‌-బి నుంచి ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక సూపర్‌-4లో అడుగు పెట్టాయి. ఇక ఈ మెగా టోర్నీలో సూపర్‌-4 దశకు శనివారం తెరలేవనుంది. సూపర్‌-4లో భాగంగా తొలి మ్యాచ్‌లో గ్రూపు-బి నుంచి ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌ షార్జా వేదికగా శనివారం(సెప్టెంబర్‌-3) సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా అంతకుముందు ఈ మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 27న శ్రీలంకను ఆఫ్గానిస్తాన్‌ చిత్తు చేసింది. ఆఫ్గానిస్తాన్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నబీ సేన..  అన్నింటిల్లోనూ విజయం సాధించి గ్రూప్‌-బి నుంచి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌ చేతిలో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ రెండో మ్యాచ్‌లో బం‍గ్లాదేశ్‌పై విజయం సాధించిడం ఆ జట్టుకు కాస్త ఊరటను కలిగించింది.

హాట్‌ ఫేవరేట్‌గా ఆఫ్గానిస్తాన్‌
ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు నజీబుల్లా జద్రాన్ కూడా దుమ్ము రేపుతున్నాడు. కాగా ప్రస్తుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా ఆఫ్గానిస్తాన్‌ కొనసాగిస్తే.. సూనయసంగా విజయం సాధించడం ఖాయం.

బౌలర్లు చేలరేగితే! 
ఇక శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిల్లోనూ విఫలమైన లంక, రెండు మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌ పరంగా అదరగొట్టింది. అయితే ఆ జట్టులో అనుభవం ఉన్న బౌలర్‌ ఒక్కరు కూడా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హాసరంగా ఉన్నప్పటికీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు రాణిస్తే ఆఫ్గాన్‌కు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం. బ్యాటింగ్‌లో కుశాల్‌ మెండిస్‌, కెప్టెన్‌ శనక మంచి టచ్‌లో ఉన్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై ఓటమికి  లంక బదులు తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి.
చదవండి: Ind Vs Pak: హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే!

మరిన్ని వార్తలు