ఆసియా ఆర్చరీలో గోల్డ్‌మెడల్‌ సాధించిన ఆంధ్రా అమ్మాయి..

19 Nov, 2021 07:54 IST|Sakshi

ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. మహిళల కాంపౌండ్‌ విభాగంలో గురువారం జరిగిన ఫైనల్లో సురేఖ 146–145తో కొరియా ఆర్చర్‌ యూహ్యూన్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకాన్ని అందుకుంది. తొలి నాలుగు సెట్లు పూర్తయ్యేసరికి సురేఖ 118–116తో యూహ్యూన్‌పై రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సెట్‌లోని మూడు బాణాలకు సురేఖ వరుసగా 10, 9, 9 పాయింట్లు స్కోరు చేయగా... యూహ్యూన్‌ 10, 9, 10 స్కోరు చేసింది. ఫలితంగా సురేఖ పాయింట్‌ తేడాతో గెలుపొంది స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది.

అయితే ఆఖర్లో కొరియా కోచ్‌ మ్యాచ్‌ జడ్జితో వాదనకు దిగాడు. యూహ్యూన్‌ వేసిన ఐదో సెట్‌ రెండో బాణం 10 పాయింట్ల సర్కిల్‌ గీతకు మిల్లీ మీటర్‌ తేడాతో బయటి వైపు గుచ్చుకుంది. దీనికి జడ్జి 9 పాయింట్లు కేటాయించగా... 10 పాయింట్లు ఇవ్వాల్సిందిగా కొరియా కోచ్‌ కాసేపు వాదించాడు. బాణాన్ని పలు మార్లు పరిశీలించిన జడ్జి... దానికి 9 పాయింట్లనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో సురేఖకు గెలుపు ఖాయమైంది. పురుషుల కాంపౌండ్‌ విభాగంలో భారత ఆర్చర్‌ అభిషేక్‌ వర్మ రజతాన్ని సాధించాడు. ఫైనల్లో అతడు 148–149తో కిమ్‌ జోంగ్‌హూ (కొరియా) చేతిలో ఓడాడు. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సురేఖ– రిషభ్‌ యాదవ్‌ (భారత్‌) జంట 154–155తో కిమ్‌ యున్‌హీ–చోయ్‌ యాంగ్‌హీ (కొరియా) ద్వయం చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది.

చదవండి: IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్‌ దాఖలు

మరిన్ని వార్తలు