ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్‌.. ఓ వినూత్న రికార్డు నమోదు

27 Sep, 2023 15:16 IST|Sakshi

ఏషియన్‌ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ టీ20 రికార్డులను తిరగరాసింది.

మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్‌.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్‌ స్కోర్‌తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి  మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్‌ ఫిఫి (దీపేంద్ర సింగ్‌-9 బంతుల్లో), ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ (కుషాల్‌ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్‌కు అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్‌రేట్‌ (దీపేంద్ర సింగ్‌- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. 

పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్‌లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది.  మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్‌ బైలు, 2 నోబాల్స్‌) టాప్‌ స్కోర్‌ కావడం. ఓ జట్టు స్కోర్‌లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్‌లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్‌ట్రాల తర్వాత మంగోలియన్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక​ స్కోర్‌ దవాసురెన్‌ జమ్యసురెన్‌  (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్‌ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్‌ బౌలర్లు కరణ్‌, అభినాశ్‌, సందీప్‌ లామిచ్చెన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్‌, కుశాల్‌ భుర్టెల్‌, దీపేంద్ర సింగ్‌ తలో వికెట్‌ దక్కించకున్నారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్‌ భుర్టెల్‌ (19), ఆసిఫ్‌ షేక్‌ (16) విఫలం కాగా.. కుషాల్‌ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్‌; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్‌ (10 బంతుల్లో 52 నాటౌట్‌; 8 సిక్సర్లు), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. 

మరిన్ని వార్తలు