టీ20ల్లో నేపాల్‌ బౌలర్‌ అత్యుత్తమ గణాంకాలు

1 Oct, 2023 14:13 IST|Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ మెన్స్‌ క్రికెట్‌ రికార్డులకు అడ్డాగా మారింది. ఈ పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నేపాల్‌ జట్టు ప్రస్తుత ఏషియన్‌ గేమ్స్‌లో రికార్డుల రారాజుగా మారింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌, ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి రికార్డులతో పాటు పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు.

తాజాగా మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు బౌలర్‌ అభానష్‌ బొహారా టీ20ల్లో ఏడో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 3.4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో నేపాల్‌ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఈ విభాగానికి సంబంధించి మలేషియా బౌలర్‌ శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ పేరిట అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి. ఇదే ఏడాది చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఇద్రుస్‌ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్‌ ఇద్రుస్‌కు ముందు 7 వికెట్లు తీయలేదు. 

ఇదిలా ఉంటే, ఏషియన్‌ గేమ్స్‌లో మాల్దీవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ 138 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. మాల్దీవ్స్‌ 19.4 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ 27 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేయగా.. గత మ్యాచ్‌లో టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు నమోదు చేసిన కుషాల్‌ మల్లా మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 47 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడాడు.

మాల్దీవ్స్‌ బౌలర్లలో నజ్వాన్‌ ఇస్మాయిల్‌ (4-0-17-3) ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన మాల్దీవ్స్‌ అభినాశ్‌ బొహార ధాటికి 74 పరుగులకు కుప్పకూలింది. మాల్దీవ్స్‌ ఇన్నింగ్స్‌లో ఘనీ (36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో భారత్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 3న జరుగనుంది.

మరిన్ని వార్తలు