Asian Games 2023: చైనాలో కొనసాగుతున్న భారత్‌ పతకాల వేట..

2 Oct, 2023 12:03 IST|Sakshi

Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది.

కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్‌ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్‌లో 3, బ్యాడ్మింటన్‌, గోల్ఫ్‌, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం!

ముఖర్జీ సిస్టర్స్‌కు కాంస్యం
టేబుల్‌ టెన్నిస్‌ వుమెన్స్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు బ్రాంజ్‌ మెడల్‌ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు.

రోలర్‌ స్కేటింగ్‌లో..
భారత స్కేటింగ్‌ రిలే టీమ్‌ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్‌, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు.

అబ్బాయిలు సైతం..
రోలర్‌ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ. రిలే టీమ్‌ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్‌ పాల్‌, ఆనంద్‌ కుమార్‌, సిద్ధాంత్‌, విక్రమ్‌ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు.

మరిన్ని వార్తలు