Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్‌.. మరో 2 స్వర్ణాలు

1 Oct, 2023 18:15 IST|Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. ఆదివారం టీమిండియా ఖాతాలో మరో 2 స్వర్ణ పతకాలు చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్‌ సాబ్లే.. షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ స్వర్ణాలతో మెరిశారు. ఈ రెండు మెడల్స్‌తో ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 13 బంగారు పతకాలు చేరాయి. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 45కు (13 గోల్డ్‌, 16 సిల్వర్‌, 16 బ్రాంజ్‌) చేరింది. 

పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 233 పతకాలతో (124 గోల్డ్‌, 71 సిల్వర్‌, 38 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 122 పతకాలతో (30, 34, 58) రెండో స్థానంలో, జపాన్‌ 110 మెడల్స్‌తో (29, 40, 41) మూడో స్థానంలో ఉన్నాయి.

రికార్డు బద్దలు కొట్టిన సాబ్లే..
3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించిన అవినాశ్‌ సాబ్లే 8:19:50 సెకెన్లలో పరుగును పూర్తి చేసి ఏషియన్‌ గేమ్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు. రేస్‌ పూర్తియ్యే సరికి సాబ్లే దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం విశేషం. ఈ పతకం ప్రస్తుత ఎడిషన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం. 

నాలుగో షాట్‌పుటర్‌..
షాట్‌పుట్‌లో స్వర్ణంతో మెరిసిన తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ వరుసగా రెండో ఏషియన్‌ గేమ్స్‌లో (2018, 2023) గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన నాలుగో షాట్‌పుటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పర్దుమాన్‌ సింగ్‌ బ్రార్‌ (1954, 1958), జోగిందర్‌ సింగ్‌ (1966, 1970), బహదూర్‌ సింగ్‌ చౌహాన్‌ (1978, 1982) ఈ ఘనత సాధించారు.

ప్రస్తుత క్రీడల్లో తూర్‌ సాధించిన పతకం భారత్‌కు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో రెండోది. దీనికి కొద్దిసేపటి ముందే అవినాశ్‌ సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణ పతకం సాధించాడు.

మరిన్ని వార్తలు