World cup 2023: మాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీ.. సెమీస్‌కు ఆస్ట్రేలియా

7 Nov, 2023 22:38 IST|Sakshi

ఆఫ్ఝనిస్తాన్‌తో జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో లక్ష‍్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మాక్స్‌వెల్ అద్భుతంగా ఆడి డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 128 బంతుల్లో 201 పరుగులు సాధించాడు. 

ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ 21 పరుగులకే అవుట్‌ అయినప్పటికీ.. మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.అజేయ శతకంతో ఆఖరి వరకు క్రీజులో ఉండి మొత్తంగా 129 పరుగులు సాధించాడు.

మిగతా వాళ్లలో రహ్మత్‌ షా 30, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది 26, అజ్మతుల్లా 22 చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అయితే, చివర్లో రషీద్‌ ఖాన్‌ 18 బంతుల్లో 35 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి వారెవ్వా అనిపించాడు.జద్రాన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు రషీద్‌ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్‌ 291 పరుగులు చేసింది. తద్వారా ప్రపంచకప్‌ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది.

292 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 24 పరుగులు చేసి నవీన్-ఉల్-హక్ బౌలింగ్ లోనే  రెండో వికెట్గా అవుట్ అయ్యాడు . తరువాత వచ్చిన మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. 

ఒకదశలో తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవుతారు అనుకున్న తరుణంలో మాక్స్‌వెల్ అఫ్గనిస్తాన్‌ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగి అద్భుతమైన స్ట్రోక్ ప్లే తో డబుల్ సెంచరీతో( 201 ) ఆస్ట్రేలియా టీం ను గెలిపించాడు.

అయితే లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో దెబ్బ కొట్టినప్పటికి మ్యాక్సి సంచలన ఇన్నింగ్స్ ముందు తలవంచక తప్పలేదు. వరల్డ్ కప్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన మ్యాక్స్ వెల్ ఆస్ట్రేలియాను సెమీస్ చేర్చి డబుల్ ధమాకా అందించాడు.

మరిన్ని వార్తలు