Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!

7 Mar, 2022 07:43 IST|Sakshi

టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌పై ఆస్ట్రేలియా మీడియా విరుచుకుపడింది. ఒకవైపు తమ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ అస్తమయంతో తామంతా బాధలో ఉంటే.. మీకు ఇప్పుడు ఎవరు గొప్ప అనేది అంత అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇండియా టుడే టెలివిజన్‌ షోలో గావస్కర్‌ పాల్గొన్నాడు. వార్న్‌ గొప్ప సిన్నర్‌ అనేది మీరు నమ్ముతున్నారా అంటూ ప్రశ్నించారు.

దీనిపై గావస్కర్‌ మాట్లాడుతూ.. ''నా దృష్టిలో వార్న్‌ కంటే శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌, టీమిండియా స్పిన్నర్ల తర్వాతే వార్న్‌కు స్థానం ఉంటుంది. ఎందుకంటే వార్న్‌ గొప్ప స్పిన్నర్‌ కావొచ్చు.. కానీ టీమిండియాపై అతనికి ఫేలవ రికార్డు ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా చెలరేగిపోయే వార్న్‌ భారత్‌కు వచ్చేసరికి సాధారణ బౌలర్‌గా మారిపోయేవాడు.

గతంలో నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఒక టెస్టులో వార్న్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. అది కూడా జహీర్‌ఖాన్‌ రూపంలో వార్న్‌కు ఐదో వికెట్‌ లభించింది. అది కూడా కష్టంగానే వచ్చింది. టీమిండియా ఆటగాళ్లు స్పిన్‌ బాగా ఆడగలరని దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే వార్న్‌ను గ్రేట్‌ స్పిన్నర్‌గా అభివర్ణించలేను. కానీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ మాత్రం టీమిండియా ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెట్టాడు. అతనికి భారత్‌పై మంచి రికార్డు ఉంది. అందుకే నా పుస్తకంలో మురళీధరన్‌ను వార్న్‌ కంటే ముందు స్థానంలో ఉంచాను.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా గావస్కర్‌ ఇచ్చిన సమాధానంపై ఆసీస్‌ మీడియాతో పాటు ఫాక్స్‌ స్పోర్ట్స్‌, హెరాల్డ్‌ సన్‌ లాంటి పత్రికలు.. చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ''గావస్కర్‌ రికార్డులు గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా అని ఒకసారి ఆలోచించండి. ఎంతకాదన్న అతను ఒక దిగ్గజ స్పిన్నర్‌. అలాంటి ఆటగాడు ఇక లేరన్న వార్త క్రికెట్‌ ప్రపంచంలో విషాదాన్ని నింపిన వేళ మీరు ఇలాంటి కామెంట్స్‌ చేయడం అనర్థం. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది.'' అంటూ ఆసీస్‌ మీడియా ఏకిపారేసింది.

''36 పరుగులు చేయడానికి 174 బంతులు తీసుకున్నావు. జిడ్డు ఆటకు పర్యాయపదంగా మారావు. నీ ఆటను మేం తప్పుబట్టం. కానీ ఇలాంటి భావోద్వేగ సమయంలో ఇలాంటి కామెంట్స్‌ చేయడం బాధాకరం..'' అంటూ ఆసీస్‌ అభిమాని ట్వీట్‌ చేశాడు.

''వార్న్‌పై గావస్కర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టం. పేరులో సన్నీ ఉన్నంత మాత్రానా మీరు ఇప్పుడు మండిపోవాలా.. వార్న్‌ శరీరం ఇంకా చల్లబడలేదు.. నిజాయితీగా చెప్పాలంటే ఎవరు గొప్ప అనేది ఇప్పుడు మాట్లాడడం సరికాదు'' అంటూ జాక్‌ మెండల్‌ ట్వీట్‌ చేశాడు.

చదవండి: Shane Warne: స్పిన్‌ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!

Shane Warne: శవ పరీక్షకు వార్న్‌ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు

Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా!

మరిన్ని వార్తలు