Babar Azam: శతక్కొట్టుడులో బాబర్‌ ఆజమే టాప్‌

3 Dec, 2022 20:24 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మరో రికార్డు సాధించాడు. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన ఆజమ్‌ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్‌).. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (7) చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ జానీ బెయిర్‌స్టో (6) అధిగమించిన బాబర్‌.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 259 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 27 శతకాలు సాధించిన బాబర్‌.. ఈ ఒక్క ఏడాదే 7 సెంచరీలు సాధించడం విశేషం. ఇంగ్లండ్‌పై ఇవాళ (డిసెంబర్‌ 3) చేసిన సెంచరీ బాబర్‌ టెస్ట్‌ కెరీర్‌లో 8వ శతకం.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన భారీ స్కోర్‌కు ధీటుగా జవాభిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో (బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌)) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి ఆలౌటైంది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ శతకాలతో విరుచుకుపడ్డారు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్‌ టాప్‌-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. అఘా సల్మాన్‌ (10), జహీద్‌ మహమూద్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్‌.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 158 పరుగులు వెనుకపడి ఉంది.

మరిన్ని వార్తలు