IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్‌.. ముగ్గురు స్టార్‌ ఆటగాళ్లు దూరం

11 Sep, 2021 16:56 IST|Sakshi

దుబాయ్‌: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్‌ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరం కానున్నట్లు బ్రిటీష్‌ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్‌రైజర్స్‌ కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు డేవిడ్‌ మలాన్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌.. మలిదశ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్‌ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు.
చదవండి: ఈసారి టైటిల్‌ నెగ్గేది మేమే: డీసీ స్టార్‌ ప్లేయర్‌

మరిన్ని వార్తలు