WC 2023: ‘టైమ్డ్‌ అవుట్‌’ అప్పీలుతో చరిత్రకెక్కిన బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

7 Nov, 2023 15:30 IST|Sakshi

ICC WC 2023- Shakib Al Hasan: ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి శ్రీలంకపై గెలిచి జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఈవెంట్‌ నుంచి నిష్క్రమించాడు.

ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్‌ ఈవెంట్లో తొలిసారి లంకపై పైచేయి సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే కూడా ‘టైమ్డ్‌ అవుట్‌’కు అప్పీలు చేసిన కారణంగానే బంగ్లా జట్టు వార్తల్లో నిలిచింది.

టైమ్డ్‌ అవుట్‌ అప్పీలుతో చరిత్రకెక్కిన షకీబ్‌
లంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడనే కారణంగా బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పీలు చేశాడు. ఐసీసీ వరల్డ్‌కప్‌ నిబంధనల ప్రకారం అతడు రెండు నిమిషాల్లోపు బాల్‌ను ఫేస్‌ చేయలేదన్న విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకువెళ్లి తన పంతం నెగ్గించుకున్నాడు.

దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్‌ అవుట్‌గా వెనుదిరిగిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్‌ చరిత్రకెక్కగా.. ష​కీబ్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. క్రీడా వర్గాల్లో ఈ ఘటనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉండగానే.. బంగ్లాదేశ్‌కు ఓ షాక్‌ తగిలింది.

చేతివేలికి గాయం
శ్రీలంకతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడ్డ షకీబ్‌ అల్‌ హసన్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మధ్యవేలుకు తగిలిన గాయం తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే తీయించగా.. ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. 

ఈ గాయం నుంచి కోలుకోవాలంటే షకీబ్‌కు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పునరావాసం కోసం షకీబ్‌ అల్‌ హసన్‌ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ జట్టు ఫిజియో బేజెదుల్‌ ఇస్లాం ఖాన్‌ తెలిపినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి వెల్లడించింది.

A post shared by ICC (@icc)

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ‘అవుట్‌’
కాగా శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో మాథ్యూస్‌ విషయంలో అప్పీలుతో మరోసారి వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డ షకీబ్‌.. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించి.. బంగ్లాదేశ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు 2 వికెట్లు కూడా కూల్చిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో షకీబ్‌ వికెట్‌ను మాథ్యూస్‌ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే, మాథ్యూస్‌ విషయంలో బంగ్లా జట్టుకు వికెట్‌ దక్కినప్పటికీ.. అప్పటికి ఓవర్‌ కంటిన్యూ చేస్తున్న బౌలర్‌(షకీబ్‌ అల్‌ హసన్‌) ఖాతాలో మాత్రం జమకాదు.

A post shared by ICC (@icc)

సెమీస్‌ చేరకున్నా.. ఆ టోర్నీకి అర్హత సాధించేందుకు
కాగా ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాతో తమ చివరి మ్యాచ్‌ ఆడనుంది.  ఇప్పటికే సెమీస్‌ నుంచి నిష్క్రమించినా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశాలు బంగ్లాకు సజీవంగా ఉంటాయి.

చదవండి: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్‌ స్మిత్‌ కూడా షకీబ్‌లా ఆలోచించి ఉంటే..!

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు