సిరీస్‌ ఓటమిపై బీసీబీ ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా

28 Dec, 2022 17:38 IST|Sakshi

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రస్సెల్‌ డొమింగో తన పదవికి రాజీనామా చేశాడు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్‌ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్‌ పదవి నుంచి వైదొలిగాడు. అయితే డొమింగో ఉన్నపళంగా రాజీనామా చేయడం వెనుక బంగ్లా క్రికెట్‌ బోర్డు ఆపరేషన్స్ హెడ్‌ జలాల్‌ యూనస్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా ఓడిపోగానే జలాల్‌ యూనస్‌ స్పందిస్తూ.. ''మాకు జట్టుపై ప్రభావం చూపగల కోచ్‌ అవసరం. తమకు కోచ్‌ కావాల్సిన అవసరం ఉందని.. మెంటార్‌ కాదు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. జలాల్‌ వ్యాఖ్యలు డొమింగోకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.దీనికి తోడు రాజీనామా లేఖను పంపిన వెంటనే బంగ్లా బోర్డు ఆమోదించడం గమనార్హం.

అయితే రస్సెల్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లా ఆటతీరులో చాలా మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. డొమింగో హెడ్‌కోచ్‌గా ఉ‍న్న సమయంలో బంగ్లా జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌లో మొదటిసారి టెస్ట్ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, భారత్‌లపై వన్డే సిరీస్‌లను గెలుచుకుంది.

అయితే వరల్డ్‌కప్‌కు ముందు డొమింగోను టి20 కోచింగ్‌ బాధ్యతల నుంచి తప్పించి శ్రీధరన్‌ శ్రీరామ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుంచి టి20 కోచ్‌గా శ్రీధరన్‌ శ్రీరామ్‌ ఉన్నాడు. ఇక వచ్చే మార్చిలోగా కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు బంగ్లా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. మార్చిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో ఆడనున్నది. కొత్త కోచ్‌గా శ్రీలంకకు చెందిన చండికా హతురుసింఘే ఎంపికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇకపై టెస్టులు, వన్డేలకు ఒక కోచ్‌.. టి20లకు సెపరేట్‌ కోచ్‌ ఉంటారని స్పష్టం చేసింది.

చదవండి: క్రికెట్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహ్మద్‌ రిజ్వాన్‌.. 

అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..

మరిన్ని వార్తలు