Angelo Mathews Timed Out: అది క్రీడా స్పూర్తి అంటే.. గ్రేమ్‌ స్మిత్‌ కూడా షకీబ్‌లా ఆలోచించి ఉంటే..!

7 Nov, 2023 08:13 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ ఓ ఆటగాడు టైమ్‌ ఔట్‌ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించి మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తీసుకురావడాన్ని యావత్‌ క్రీడా ప్రపంచం వ్యతిరేస్తుంది. ఈ విషయంలో షకీబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సందర్భంలో ప్రత్యర్ధి కెప్టెన్‌ క్రీడాస్పూర్తిని చాటుకుని, బ్యాటర్‌ టైమ్‌ ఔట్‌ కాకుండా కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. 2007 జనవరి 5న భారత్‌-సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సౌరవ్‌ గంగూలీ ఆరు నిమిషాలు ఆలస్యంగా క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్ టైమ్‌ ఔట్‌ నిబంధనను అమలు చేయకూడదని అంపైర్‌ను కోరి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. 

A post shared by ICC (@icc)

టైమ్‌ ఔట్‌ విషయంలో బ్యాటర్‌ ఆలస్యానికి సరైన కారణాలు ఉన్నాయని విశ్వసిస్తే, టైమ్ ఔట్ నిబంధనను విస్మరించమని అంపైర్‌ను అభ్యర్థించే విచక్షణ ప్రత్యర్థి కెప్టెన్ ఉంటుంది. ఆ సందర్భంలో గ్రేమ్‌ స్మిత్‌ తన విచక్షణను ఉపయోగించి, క్రీడాస్పూర్తిని చాటుతూ గంగూలీ ఔట్‌ కాకుండా సాయపడ్డాడు. నాడు గ్రేమ్‌ స్మిత్‌ చేసిన పనికి క్రికెట్‌ ప్రపంచం జేజేలు కొట్టింది.

అయితే నిన్నటి మ్యాచ్‌లో షకీబ్‌.. అందుకు భిన్నంగా వ్యవహరించి జనాల చీత్కారాలకు గురవుతున్నాడు. ఒకవేళ ఆ రోజు గ్రేమ్‌ స్మిత్‌ కూడా షకీబ్‌లాగే పట్టుబట్టి గంగూలీని టైమ్‌ ఔట్‌గా ప్రకటించాలని అంపైర్‌పై ఒత్తిడి తెచ్చి ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో టైమ్‌ ఔట్‌ అయిన తొలి ఆటగాడిగా గంగూలీ రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడు.

నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..?
శ్రీలంక ఇన్నింగ్స్‌ 24 ఓవర్ వేసిన షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్‌ తీసుకోనే సమయంలో తన హెల్మెట్‌ బాగో లేదని మాథ్యూస్‌ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు కొత్త హెల్మెట్‌ కోసం సైగలు చేశాడు.

A post shared by ICC (@icc)

వెంటనే సబ్‌స్ట్యూట్‌ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్‌ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ టైమ్ ఔట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదివరకే ఎలిమినేట్‌ అయిన బంగ్లాదేశ్‌కు ఇది కంటితుడుపు విజయం. ఈ మ్యాచ్‌లో ఓటమితో శ్రీలంక కూడా బంగ్లాదేశ్‌లా సెమీస్‌కు చేరకుండానే ఎలిమినేట్‌ అయ్యింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో పాటు ఇంగ్లండ్‌ కూడా ఇదివరకే ఎలిమినేట్‌ కాగా.. భారత్‌, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం​ పోటీ నడుస్తుంది.

చదవండి: మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌.. అలా జరిగినందుకు బాధ లేదు.. రూల్స్‌లో ఉన్నదే చేశా: షకీబ్‌

మరిన్ని వార్తలు