BBL 2022-23: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి గెలిపించాడు

16 Jan, 2023 20:49 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్‌ బ్యాటర్‌ మ్యాట్‌ రెన్షా (56 బంతుల్లో 90 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆఖరి బంతిని బౌండరీగా తరలించి తన జట్టును గెలిపించాడు. బ్రిస్బేన్‌ గెలవాలంటే చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, రెన్షా అద్భుతమైన స్కూప్‌ షాట్‌ ఆడి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బ్రిస్బేన్‌.. మైఖేల్‌ నెసర్‌ (4/25), స్పెన్సర్‌ జాన్సన్‌ (1/41), బాజ్లీ (1/35), రెన్షా (1/5) రాణించడంతో మెల్‌బోర్న్‌ హీట్‌ను 159 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌లో నిక్‌ లార్కిన్‌ (58) అర్ధసెంచరీతో రాణించగా.. థామస్‌ రోజర్స్‌ (26), వెబ్‌స్టర్‌ (36) పర్వాలేదనిపించారు. 

అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ను రెన్షా ఒంటి చేత్తో గెలిపించాడు. బిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (14), జిమ్మీ పియర్సన్‌ (22) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేసినప్పటికీ.. రెన్షా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో లియామ్‌ హ్యాచర్‌, ఆడమ్‌ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, క్లింట్‌ హింక్లిఫ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు