India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్‌.. ఇప్పుడు సూర్య, చహల్‌

20 Dec, 2022 18:30 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌- యజువేంద్ర చహల్‌

BCCI Directive To Players To Feature in Ranji Trophy During Beak?!: ఈ ఏడాది ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ గెలిచినా.. వన్డే సిరీస్‌ ఓడింది. అదే తరహాలో బంగ్లాదేశ్‌ చేతిలో కూడా పరాజయం పాలైంది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలపాలైంది భారత జట్టు.

ఇంట్లో కూర్చోవద్దు!
ఇక టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత సెలక్షన్‌ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ.. పలు ప్రక్షాళన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల పట్ల కూడా కఠిన వైఖరి అవలంబించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జాతీయ జట్టుకు ఎంపిక కాని తరుణంలో విశ్రాంతికి పరిమితం కాకుండా.. దేశవాళీ క్రికెట్‌ ఆడటంపై దృష్టి సారించాల్సిందిగా క్రికెటర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ నేతృత్వంలోని ఆఫీస్‌ బేరర్ల కొత్త బృందం.. క్రాంటాక్ట్‌ ప్లేయర్లు కచ్చితంగా డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

రంగంలోకి సూర్య, చహల్‌
టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌ సహా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ తాజాగా రంజీ ట్రోఫీలో భాగం కావడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ రౌండ్‌లో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి యువ క్రికెటర్లు తమ జట్ల తరఫున రంజీ బరిలో దిగగా.. డిసెంబరు 20న మొదలైన రెండో రౌండ్‌లో సూర్య, చహల్‌ కూడా వచ్చి చేరారు. ఈ విషయాల గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడారు.

దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందే
‘‘ఇటీవలి కాలంలో చాలా మంది భారత ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. ఫిట్‌గా ఉండాలంటే వాళ్లకు కచ్చితంగా ప్రాక్టీసు ఉండాలి. అన్ని ఫార్మాట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలగాలి. అధ్యక్షుడు సూచించినట్లుగా టీమిండియా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడాల్సి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా ముంబై తరఫున మంగళవారం రంగంలోకి దిగిన సూర్య.. వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ మెరుపు ఇన్నింగ్స్‌(80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 90 పరుగులు) ఆడాడు.

రంజీ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా ప్లేయర్లు
►సూర్యకుమార్‌ యాదవ్‌(ముంబై)
►యజువేంద్ర చహల్‌(హర్యానా)
►సంజూ శాంసన్‌(కేరళ)
►ఇషాన్‌ కిషన్‌(జార్ఖండ్‌)
►దీపక్‌ హుడా(రాజస్తాన్‌)
►హనుమ విహారి(ఆంధ్ర)
►ఇషాంత్‌ శర్మ(ఢిల్లీ)
►మయాంక్‌ అగర్వాల్‌(కర్ణాటక)
►అజింక్య రహానే(ముంబై)
►వృద్ధిమాన్‌ సాహా(త్రిపుర)

చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్‌ ఊచకోత కొనసాగింపు
శతక్కొట్టిన దీపక్‌ హుడా.. 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో..!
IPL 2023 Mini Auction: విలియమ్సన్‌ స్థానాన్ని భర్తీ చేయగలిగేది, సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కూడా అతడే!

మరిన్ని వార్తలు