U19 WC: ద్రవిడ్, లక్ష్మణ్ మాస్టర్ ప్లాన్.. వాళ్ళ రాతలు మారిపోతాయి!

8 Feb, 2022 05:46 IST|Sakshi

యువ ప్రతిభావంతులను కాపాడుకోవడానికి బీసీసీఐ ప్రణాళిక

న్యూఢిల్లీ: మనోజ్‌ కల్రా... 2018 అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’. అయితే నాలుగేళ్ల తర్వాత కూడా అతని కెరీర్‌ ఊపందుకోలేదు. కల్రా మాత్రమే కాదు... ఎంతో మంది కుర్రాళ్లు వరల్డ్‌కప్‌ లాంటి విజయం తర్వాత కూడా ముందుకు దూసుకుపోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అండర్‌–19 వయో విభాగానికి, రంజీ ట్రోఫీకి మధ్య ఉన్న అంతరం కారణంగా వారికి సరైన మార్గనిర్దేశనం లేకుండా పోతోంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయికి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వారు అధిగమించలేక వెనుకబడిపోతున్నారు.

ఇలాంటి ఆటగాళ్ల కోసం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ‘19 ప్లస్‌’ పేరుతో ఉండే ఈ బృందంలో అండర్‌–19 వరల్డ్‌కప్‌ విజేతలతో పాటు అదే వయో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రతిభ గల ఆటగాళ్లను చేరుస్తారు. పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరిస్తూ సాధనతో పాటు అవకాశం ఉన్నప్పుడల్లా (అండర్‌–25 తదితర) ఆయా రాష్ట్ర జట్ల తరఫున ఆడే అవకాశం కల్పిస్తారు. ఇదంతా ఎన్‌సీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లు జాతీయ సీనియర్, జూనియర్‌ సెలక్టర్లతో ఈ అంశంపై చర్చించి త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు