ఆసీస్‌కు భారత్‌ జంబో బృందం!

22 Oct, 2020 05:34 IST|Sakshi

32 మందితో కంగారూ గడ్డకు

భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌కు ‘నో’  

ముంబై: వచ్చే నెలలో కోహ్లి సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. పూర్తిస్థాయిలో అన్ని ఫార్మాట్లు ఆడనున్న నేపథ్యంలో అక్కడికి టీమిండియా జంబో సేనతో బయల్దేరుతుంది. పైగా కరోనా ప్రొటోకాల్‌ కూడా ఉండటంతో ఒకేసారి భారీ జట్టునే పంపనున్నట్లు తెలిసింది. మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళతారు. ఇందులో భారత్‌ ‘ఎ’ ఆటగాళ్లు కూడా ఉంటారు.

యూఏఈలో ప్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న క్రికెటర్లు అక్కడి నుంచే నేరుగా ఆసీస్‌కు పయనమవుతారు. కరోనా మహమ్మారి తర్వాత కోహ్లి సేన ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌ ఇదే. రెండున్నర నెలల పాటు సాగే ఈ పర్యటనలో భారత్‌ మూడు టి20లు, మూడు వన్డేలతోపాటు నాలుగు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. ఇందులో ఒక డే–నైట్‌ టెస్టు జరుగుతుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగిశాక టెస్టు జట్టులో లేని ఆటగాళ్లను స్వదేశానికి పంపే అవకాశాల్ని అప్పటి పరిస్థితుల్ని బట్టి తీసుకుంటుంది.  

‘జంబో సేన’ ఎందుకంటే...
ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఏ దేశంలోనూ పూర్తిస్థాయిలో పునరుద్ధరించనే లేదు. పైగా వెళ్లిన ప్రతీ ఒక్కరు క్వారంటైన్‌ కావాల్సిందే. దీంతో టూర్‌ మధ్యలో ఆటగాడు ఎవరైనా గాయపడితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ప్రత్యేక విమానం (చార్టెడ్‌ ఫ్లయిట్‌) కావాలి. తీరా భర్తీ అయిన ఆటగాడు అక్కడికి వెళ్లాక జట్టుతో కలిసే అవకాశం కూడా ఉండదు. 14 రోజులు క్వారంటైన్‌లో గడపాల్సిందే. ఈ సమయంలో రెండు, మూడుసార్లు కోవిడ్‌ పరీక్ష చేస్తారు.

ప్రయాణ బడలికలో కానీ, ఇతరత్రా సౌకర్యాల వల్ల కరోనాను పొరపాటున అంటించుకుంటే ఇంత వ్యయప్రయాసలోర్చి పంపిన ఆటగాడు ఆడే అవకాశం క్లిష్టమవుతుంది. ఇవన్నీ కూలంకశంగా పరిశీలించిన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఏకంగా జంబో సేనను పంపడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు భారత బృందమే రెండు మూడు జట్లుగా ఏర్పడి ప్రాక్టీస్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే సుదీర్ఘంగా సాగే ఈ టూర్‌ పూర్తిగా ఆటగాళ్ల వరకే పరిమితమవుతుంది. క్రికెటర్ల వెంట సతీమణులు, ప్రియసఖిలకు అనుమతి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌లో మాత్రం భార్య, గర్ల్‌ఫ్రెండ్స్‌పై నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలకే వదిలేసిన సంగతి తెలిసిందే.  

ముందుగా పొట్టి మ్యాచ్‌లు...
కంగారూ గడ్డపై ముందుగా భారత్‌ మూడు పొట్టి మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం టి20లు ముగిశాక... వన్డేలు ఆడుతుంది. అయితే దీనికి సంబంధించిన తేదీలను మాత్రం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెలాఖరులోగా తుది షెడ్యూల్‌ను భారత బోర్డుకు తెలియజేసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా టెస్టు స్పెషలిస్టులైన చతేశ్వర్‌ పుజారా, హనుమ విహారిలకు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఏర్పాట్లపై బోర్డు దృష్టి పెట్టింది. ఐపీఎల్‌లో అవకాశంరాని వీరిద్దరికి దేశవాళీ టోర్నీలు కూడా లేక ఎలాంటి ప్రాక్టీసే లేకుండా పోయింది. కరోనా తర్వాత అసలు బరిలోకే దిగలేని వీరి కోసం బోర్డు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసే పనిలో పడింది.

సిడ్నీలో క్వారంటైన్‌?
భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగు పెట్టినా... క్వారంటై న్‌ మాత్రం అక్కడ కుదరదు. క్వీన్స్‌లాండ్‌ ప్రభు త్వం కరోనా నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల్ని అక్కడ బస చేసేందుకు అనుమతించడం లేదు. దీంతో సిడ్నీ లేదంటే కాన్‌బెర్రాలో 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీఏ ఉన్నతాధికారులు న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా