Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్‌ గెలుస్తారు! రోహిత్‌.. ఇంకా కోహ్లి...

23 Dec, 2021 16:25 IST|Sakshi

Balwinder Sandhu: ‘‘కపిల్‌లా బ్యాటింగ్‌ చేయండి.. కపిల్‌లా ఫీల్డింగ్‌ చేయండి. కపిల్‌లా కెప్టెన్సీ చేయండి. అప్పుడే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌... 2023లో వన్డే ప్రపంచకప్‌ గెలవగలం’’- వరుస ఐసీసీ టోర్నీల నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి సహా భారత ఆటగాళ్లను ఉద్దేశించి 1983 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా సభ్యుడు బల్వీందర్‌ సంధు చేసిన వ్యాఖ్యలు ఇవి. అన్ని విభాగాల్లో రాణిస్తేనే ఐసీసీ టైటిల్‌ గెలుస్తారని.. అందుకోసం అలుపెరుగక కృషి చేయాలని సూచించారు.

కాగా భారత్‌కు మొట్టమొదటి వరల్డ్‌కప్‌ అందించిన దిగ్గజ సారథి కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా.. 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్‌లో 83 మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించారు. డిసెంబరు 24న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్‌ వీక్షించిన సందర్భంగా జీ న్యూస్‌తో ముచ్చటించిన సంధు.. భారత జట్టును ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

ఇక కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ... ‘‘అప్పట్లో మాకు సోషల్‌ మీడియా లేదు. క్రీడాస్ఫూర్తిలో వివాదాలు కొట్టుకోపోయేవి. ప్రతి ఒక్కరు ఆటపై దృష్టి పెట్టి... కెరీర్‌లో ముందుకు వెళ్లేవారు. అయితే, చరిత్ర సృష్టించేవాళ్లు కూడా కావాలి కదా. ఆ చరిత్రను చెప్పేవాళ్లు కూడా కావాలి. ఆ మధుర జ్ఞాపకాలను వెండితెర మీద చూడటం సంతోషంగా ఉంది’’ అని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. విమర్శలకు కృంగిపోతే ఏమీ సాధించలేమని.. ఆత‍్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు దరిచేరతాయని యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. నాడు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు బలమైన విండీస్‌ను ఓడించి టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే.  

చదవండి: మ్యాచ్‌ చివరి బంతికి ఊహించని ట్విస్ట్‌
IPL 2022- SRH: సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా బ్రియన్‌ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ

మరిన్ని వార్తలు