IPL 2023: సీఎస్‌కేకు గుడ్‌న్యూస్‌.. బెన్‌ స్టోక్స్‌ ఏమన్నాడంటే..?

28 Feb, 2023 16:24 IST|Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌ చివరి అంకం మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని జరుగుతున్న ప్రచారంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఖరీదైన ఆటగాడు, ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో పరుగు తేడాతో ఓటమి అనంతరం స్టోక్స్‌ మాట్లాడుతూ.. తనపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, తాను ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

తన ప్రస్తుత శారీరక పరిస్థితిపై సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో తరుచూ మాట్లాడుతున్నాని, ఐపీఎల్‌ కోసం ఫిట్‌గా ఉండేందుకు తీవ్రంగా శ్రమిస్తానని తెలిపాడు. అలాగే, తన మోకాలి సమస్యలపై కూడా స్టోక్స్‌ వివరణ ఇచ్చాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న మోకాలి సమస్యలపై పోరాటం చేస్తున్నానని.. ఫిజియోలు, డాక్టర్ల సాయంతో దానిపై పైచేయి సాధించి, పదేళ్ల కెరీర్‌లో వంద శాతం తన పాత్రకు న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌ తర్వాత తన దృష్టంతా యాషెస్‌ సిరీస్‌పైనేనని, ప్రతిష్టాత్మక సిరీస్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ కనబర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు. 

కాగా, ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే తేదీకి (మే 28) సరిగ్గా నాలుగు రోజుల తర్వాత (జూన్‌ 1) ఇంగ్లండ్‌.. ఐర్లాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఆ వెంటనే (జూన్‌ 16) ఇంగ్లండ్‌.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. యాషెస్‌ సిరీస్‌కు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో ఈసీబీ స్టోక్స్‌ను ఐర్లాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉందిగా ఫోర్స్‌ చేయవచ్చు.

ఈ నేపథ్యంలోనే స్టోక్స్‌.. ఐపీఎల్‌లో ఆఖరి మ్యాచ్‌లకు డుమ్మా కొట్టి, ఐర్లాండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడతాడని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్టోక్స్‌ వివరణ ఇవ్వడంతో సందేహాలన్నీ తొలిగిపోయాయి. మరోవైపు ఈసీబీ.. స్టోక్స్‌ ఐపీఎల్‌ 2023లో ఆడేందుకు ఎన్‌ఓసీ కూడా ఇచ్చింది. ఐపీఎల్‌ 2023 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో సీఎస్‌కే స్టోక్స్‌ను 16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు