Beth Mooney: దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం

28 Jan, 2022 17:04 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ మహిళా క్రికెటర్‌ బెత్‌ మూనీ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్‌ చేసి బౌండరీని సేవ్‌ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో బెత్‌మూనీ ఫీల్డింగ్‌ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

చదవండి: IPL 2022: సగం సీజన్‌ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి

వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్‌ప్లేట్స్‌ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్‌, మిల్క్‌షేక్‌, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్‌ వద్ద డైవ్‌ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్‌మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్‌ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్‌ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ పేర్కొంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వుమెన్స్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ 127 పరుగులు నాటౌట్‌, సోఫీ ఎసిల్‌స్టోన్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా  9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

మరిన్ని వార్తలు