Ind Vs Aus 1st Test: ఆస్ట్రేలియా అత్యంత చెత్త రికార్డు.. అప్పుడలా.. ఇప్పుడిలా

11 Feb, 2023 16:22 IST|Sakshi

India vs Australia, 1st Test: తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా. ప్రతిష్టాత్మక బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఏకంగా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేశారు
భారత స్పిన్నర్ల మాయాజాలానికి చిక్కిన ఆసీస్‌ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. మూడో రోజైన శనివారం నాటి ఆటలో అశ్విన్‌, జడేజా ధాటికి ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు స్కోరు చేయలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో  91 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయిన కంగారూ జట్టుకు ఈ మేరకు పరాభవం తప్పలేదు. 2017లో నాటి తొలి టెస్టులో అనూహ్య విజయంతో టీమిండియాకు షాకిచ్చిన ఆసీస్‌కు ఈసారి ఘోర అవమానం తప్పలేదు.

నాడు అలా.. నేడు ఇలా
నాడు పుణేలో స్పిన్‌ పిచ్‌ సిద్ధం చేస్తే భారత జట్టు కంటే సమర్థవంతంగా దానిని వాడుకుని పైచేయి సాధించిన ఆస్ట్రేలియా.. ఈసారి కనీస పోరాటపటిమ కనబరచలేకపోయింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆలౌట్‌ కావడం వారి వైఫల్యానికి నిదర్శనం.

చెత్త రికార్డు
ఈ క్రమంలో నాగ్‌పూర్‌ టెస్టులో ఘోర ఓటమితో ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టెస్టుల్లో భారత గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కిదే అత్యల్ప స్కోరు. 2004లో ముంబై మ్యాచ్‌లో 93 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయింది. 

ఇక అంతకుముందు.. 1981లో సొంతగడ్డపై మెల్‌బోర్న్‌లో టీమిండియాతో టెస్టులో 83 పరుగులకే ఆలౌట్‌ అయింది ఆస్ట్రేలియా. నాటి మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. సెంచరీ వీరుడు గుండప్ప విశ్వనాథ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై 59 పరుగుల తేడాతో గెలిచింది.

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ-2023- తొలి టెస్టు మ్యాచ్‌ స్కోర్లు
భారత్‌- 400
ఆస్ట్రేలియా- 177 & 91
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రవీంద్ర జడేజా

మరిన్ని వార్తలు