Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా..

7 Mar, 2023 22:18 IST|Sakshi

టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తయారు చేస్తున్న పిచ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలనే తత్వంతో పిచ్‌లను ఆయా దేశాలు అనుకూలంగా తయారు చేసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నాయన్నాడు. ఒక రకంగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ వల్లే ఇదంతా జరుగుతుంది అని పేర్కొన్నాడు.

ద్రవిడ్‌ మాట్లాడుతూ.."నేను ఇండోర్‌ పిచ్‌ గురించి మరీ ఎక్కువగా మాట్లాడను. మ్యాచ్ రిఫరీ తన నిర్ణయం తాను తీసుకుంటాడు. పిచ్ పై తన అభిప్రాయం చెబుతాడు. దాంతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) నేపథ్యంలో అందరూ ఫలితాలు ఇచ్చే పిచ్‌లనే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు బ్యాలెన్స్ సాధించడం కష్టం. ఇది ఇండియాలోనే కాదు.. అన్ని చోట్లా జరుగుతున్నదే.

టీమిండియా, ఆసీస్‌ సిరీస్‌లో పిచ్‌లపై చాలా చర్చ జరుగుతోంది. కానీ పిచ్ రెండు జట్లకూ ఒకటే. కొన్నిసార్లు బౌలర్లకు, కొన్నిసార్లు బ్యాటర్లకు సవాలు విసురుతుంది. పిచ్ లు ఎలా ఉన్నా దానిపై ఆడటం నేర్చుకోవాలి. పరిస్థితులకు తగినట్లు సర్దుబాటు చేసుకోవాలి. ప్రపంచంలో ప్రతి చోటా ఫలితాలను అందించే పిచ్ లనే తయారు చేస్తున్నారు. ఈ మధ్యే సౌతాఫ్రికాలో మేము అలాంటి పిచ్ లపై ఆడాము. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరో 60-70 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ గెలిచే వాళ్లం'' అని ద్రవిడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

చదవండి: రన్నింగ్‌ బస్‌లో హోలీ వేడుకలు; డ్యాన్స్‌తో దుమ్మురేపిన క్రికెటర్లు

మరిన్ని వార్తలు