సింధు, శ్రీకాంత్‌ ముందుకు...

15 Dec, 2021 05:18 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లోకి భారత స్టార్స్‌

లక్ష్య సేన్‌ కూడా ముందంజ

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

హుఎల్వా (స్పెయిన్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ వేటను భారత స్టార్‌ పీవీ సింధు విజయంతో ప్రారంభించింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ తెలుగు తేజం మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 21–7, 21–9తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై అలవోకగా గెలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన సింధు కేవలం 24 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి కథను ముగించింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 72వ ర్యాంక్‌లో ఉన్న రెపిస్కా కేవలం 16 పాయింట్లు మాత్రమే సాధించింది. తొలి గేమ్‌లో స్కోరు 5–4 వద్ద సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా 12 పాయింట్లు గెలిచి 17–4తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో గేమ్‌లోనూ ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు తన జోరు కొనసాగించింది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ముందంజ వేసిన సింధు అటునుంచి వెనుదిరిగి చూడలేదు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్‌ చోచువోంగ్‌ (థాయ్‌ లాండ్‌)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 4–3తో ఆధిక్యంలో ఉంది.  

చెమటోడ్చి...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, భారత యువతార లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో చోటు సంపాదించారు. రెండో రౌండ్‌ అడ్డంకిని దాటడానికి వీరిద్దరూ తీవ్రంగా శ్రమించారు. ప్రపంచ 63వ ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా)తో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 15–21, 21–18, 21–17తో గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో ఒకదశలో 6–9తో వెనుకంజలో ఉన్నాడు. ఈ దశలో శ్రీకాంత్‌ చెలరేగి వరుసగా 10 పాయింట్లు గెలిచి 16–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. అదే ఉత్సాహంలో శ్రీకాంత్‌ రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్‌ 10–13తో వెనుకబడిన దశలో మళ్లీ విజృంభించాడు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–13తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గట్టెక్కాడు.  

82 నిమిషాల్లో...
ప్రపంచ 17వ ర్యాంకర్‌ కెంటా నిషిమోటో (జపాన్‌)తో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో 19వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 22–20, 15–21, 21–18తో విజయం సాధించాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం హోరాహోరీగా పోరాడారు. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 10–10 వద్ద లక్ష్య సేన్‌ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13–10తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని లక్ష్య సేన్‌ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో లూ గ్వాంగ్‌ జు (ౖచైనా)తో శ్రీకాంత్‌; కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా)తో లక్ష్య సేన్‌ తలపడతారు.

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ
పురుషుల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 43 నిమిషాల్లో 27–25, 21–17తో లీ జె హుయ్‌–యాంగ్‌ పో సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో అనుష్క పారిఖ్‌–సౌరభ్‌ శర్మ (భారత్‌) ద్వయం 8–21, 18–21తో తాన్‌ కియాన్‌ మెంగ్‌–లాయ్‌ పె జింగ్‌ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది.
 

మరిన్ని వార్తలు