అవును... ఆయన వద్దే శిక్షణ సాగుతోంది 

19 Nov, 2023 04:04 IST|Sakshi

హైదరాబాద్‌: ఈ సీజన్‌ ఆసాంతం నిరాశపరిచిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కొత్త సీజన్‌ కోసం కసరత్తు ప్రారంభించింది. భారత దిగ్గజం, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ ప్రకాశ్‌ పడుకోన్‌ వద్ద  గత ఆగస్టు నుంచి ఆమె శిక్షణ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె  నిర్ధారించింది. ‘ప్రకాశ్‌ సర్‌ మార్గదర్శనంలో నేను ట్రెయినింగ్‌ మొదలుపెట్టాను. ఆగస్టులోనే నా శిక్షణ ప్రారంభమైంది.

నిజం చెప్పాలంటే ఆయన నాకు కోచింగ్‌ గురువు కంటే ఎక్కువ. మెంటార్‌గా, మంచి గైడ్‌గా... అంతకుమించి నా నిజమైన శ్రేయోభిలాషిగా ఆయన నా ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారు. నాలోని పూర్తిస్థాయి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. జపాన్‌లో ఉండగా కేవలం ఒక ఫోన్‌కాల్‌కే ఆయన స్పందించడం... ఇంతలా వ్యక్తిగత శ్రద్ధ కనబరచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని సింధు వివరించింది.  

మరిన్ని వార్తలు