అజారుద్దీన్‌పై మరో కేసు నమోదు 

19 Oct, 2023 11:58 IST|Sakshi

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. అజహార్‌ నేతృత్వంలోని గత హెచ్‌సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అజహార్‌ అండ్‌ టీమ్‌.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్‌ పోలీసులు అజార్‌ అండ్‌ టీమ్‌పై కేసు నమోదు చేశారు.  

కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావు కమిటీ అజారుద్దీన్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసి​ందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్‌ బ్లూస్‌ క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్‌ రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్‌రావు కమిటీ అజారుద్దీన్‌ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది.

మరిన్ని వార్తలు