Chessable Masters: చెస్‌ వరల్డ్‌ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు

21 May, 2022 12:50 IST|Sakshi

చెస్‌ వరల్డ్‌ చాంపియన్‌.. నార్వే గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు 16 ఏళ్ల భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి షాక్‌ ఇచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌తో తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కార్ల్‌సెన్‌ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు.

ఇది ప్రజ్ఞానందకు కలిసొచ్చింది. దీంతో కార్ల్‌సన్‌కు చెక్‌ పెట్టిన ప్రజ్ఞా మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్‌సన్‌పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్‌ స్టేజ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్‌గా చెస్బుల్ మాస్టర్స్‌లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్‌సన్‌ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఇక కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కేవ‌లం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ‌ చెస్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ‌ద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెల‌కొల్పాడు. 

చదవండి: ప్ర‌పంచ నం.1 ఆట‌గాడికి షాకిచ్చిన‌ 16 ఏళ్ల భార‌త కుర్రాడు

మరిన్ని వార్తలు