Sakshi News home page

ప్రజ్ఞానందకు మూడో స్థానం

Published Fri, Sep 8 2023 3:02 AM

Third place for Pragnananda - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ ర్యాపిడ్‌ ఓపెన్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్‌ గ్రిషుక్‌ (రష్యా), విదిత్‌ సంతోష్‌ గుజరాతి (భారత్‌) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.

ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్‌కు నాలుగో ర్యాంక్, విదిత్‌కు ఐదో ర్యాంక్‌ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్‌లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్‌లపై గెలిచి భారత నంబర్‌వన్‌ దొమ్మరాజు గుకేశ్‌ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్‌ ఆరో స్థానంలో నిలిచాడు.

3 పాయింట్లతో అర్జున్‌ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాక్సిమి వచీర్‌ లాగ్రెవ్‌ చాంపియన్‌గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్‌ రజబోవ్‌ (అజర్‌బైజాన్‌) రన్నరప్‌గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో టోర్నీ జరుగుతుంది.   

Advertisement

What’s your opinion

Advertisement