Cristiano Ronaldo: కత్తి పట్టిన క్రిస్టియానో రొనాల్డో

23 Feb, 2023 18:34 IST|Sakshi

పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT) క్రిస్టియానో రొనాల్డో కత్తి పట్టాడు. సౌదీ అరేబియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నస్ర్‌ క్లబ్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఆర్‌7 ఈ సాహసానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే ఓ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొనాల్డో కత్తి పట్టడంతో పాటు సౌదీ సంప్రదాయ నృత్యంలోనూ భాగమయ్యాడు.

ఈ వేడుకలో సౌదీ సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు పోజిచ్చిన సీఆర్‌7.. ఆ దేశ జెండాను భుజాలపై వేసుకుని కత్తిని గాల్లోకి లేపుతూ డ్యాన్స్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో అల్‌ నస్ర్‌ యాజమాన్యంతో పాటు క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్లేయింగ్‌, నాన్‌ ప్లేయింగ్‌ సభ్యులంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించినర వీడియోను రొనాల్డో స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా షేర్‌ చేశాడు. సౌదీ అరేబియాకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందంటూ  కామెంట్స్‌ జోడించాడు. 

కాగా, సౌదీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అల్‌ నస్ర్‌.. 2023 నుంచి 2025 జూన్ వరకు రెండేళ్ల పాటు క్రిస్టియానో రొనాల్డోతో 400 మిలియన్ల యూరోలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారత కరెన్సీలో ఈ డీల్ విలువ రూ.3500 కోట్లకు పై మాటే. డీల్‌లో భాగంగా రొనాల్డో 2030 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రమోషన్‌లో భాగం కావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌కు సౌదీ.. పక్క దేశాలతో కలిసి ఆతిధ్యం ఇచ్చే అవకాశం ఉంది.   

ఇదిలా ఉంటే, సీఆర్‌7 ఇటీవలే తన క్లబ్‌ కెరీర్‌లో 500 గోల్స్‌ మైలరాయిని అధిగమించాడు. సౌదీ లీగ్‌లో భాగంగా అల్‌ వెహదా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 గోల్స్‌ చేయడం ద్వారా రొనాల్డో ఈ రేర్‌ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్‌ నస్ర్‌ 4-0 తేడాతో గెలుపొందగా.. అన్ని గోల్స్‌ సీఆర్‌7 ఖాతాలోకే వెళ్లాయి. 5 సార్లు బాలన్‌ డి ఓర్‌ విన్నర్‌ అయిన రొనాల్డో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌, ఛాంపియన్స్‌ లీగ్‌ గోల్స్‌ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విషయం విధితమే. 

మరిన్ని వార్తలు