CWC 2023 AUS VA SL: వెన్నునొప్పితో బాధపడుతూనే బరిలోకి దిగాడు.. తొలి విజయాన్ని అందించాడు

17 Oct, 2023 08:36 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడమ్‌ జంపా (8-1-47-4) ఆసీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. వెన్ను సమస్యతో బాధపడుతూనే బరిలోకి దిగిన జంపా.. నొప్పిని దిగమింగుతూ బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో జంపా కీలక వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాశించాడు.

భీకర ఫామ్‌లో ఉన్న కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ వికెట్లతో పాటు చమిక కరుణరత్నే, తీక్షణ​ వికెట్లను పడగొట్టాడు. పరుగు వ్యవధిలో గత మ్యాచ్‌ సెంచరీ హీరోలు కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ వికెట్లు పడగొట్టిన జంపా.. ఆఖర్లో 2 పరుగుల వ్యవధిలో కరుణరత్నే, తీక్షణ వికెట్లను పడగొట్టి లంక ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. నొప్పిని దిగమింగుతూ జంపా చేసిన విన్యాసాలకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

కాగా, స్పిన్నర్లకు అనుకూలిస్తున్న భారత పిచ్‌లపై ప్రస్తుత వరల్డ్‌కప్‌లో జంపాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఎడిషన్‌లో ఆసీస్‌ ఓడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన జంపా.. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చి తన జట్టుకు ఎంతో అవసరమైన విజయాన్ని అందించాడు. టీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 ఓవర్లలో వికెట్‌ లేకుండా 53 పరుగులు సమర్పించుకున్న జంపా.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే తీసి ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి జంపా ప్రదర్శన కారణంగా ఆసీస్‌ ప్రస్తుత ఎడిషన్‌లో తొలి విజయం సాధించింది. 

ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్‌​ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) మాత్రమే రాణించగా మిగతా వారంతా విఫలమయ్యారు. అసలంక (25) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆసీస్‌ బౌలరల్లో ఆడమ్‌ జంపా (8-1-47-4) లంకను దారుణంగా దెబ్బకొట్టాడు. స్టార్క్‌, కమిన్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. మ్యాక్స్‌వెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. మిచెల్‌ మార్ష్‌ (52), జోష్‌ ఇంగ్లిస్‌ (58), లబూషేన్‌ (40), మ్యాక్స్‌వెల్‌ (31 నాటౌట్‌), స్టోయినిస్‌ (20 నాటౌట్‌) రాణించడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. డేవిడ్‌ వార్నర్‌ (11), స్టీవ్‌ స్మిత్‌ (0) నిరాశపరిచారు. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక 3 వికెట్లు పడగొట్టగా.. దునిత్‌ వెల్లలగే ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇది మొదటి గెలుపు కాగా.. శ్రీలంకకు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.

మరిన్ని వార్తలు