CWC 2023: పాక్‌ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్‌ ఓడినా ఇంటికే..!

10 Nov, 2023 07:27 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో సెమీస్‌ బెర్త్‌లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరడం​ దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్‌ నాలుగో సెమీస్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుని భారత్‌తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లు సెమీస్‌కు చేరలేవు. 

287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్‌ ముందుకు..
అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్‌పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్‌ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్‌ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు.

ఇంగ్లండ్‌ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్‌ను నిలువరించడం సంగతేమో కానీ పాక్‌ ప్రస్తుత ఫామ్‌ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంటే మాత్రం టాస్‌ వద్దే పాక్‌ జట్టు ఖేల్‌ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్‌ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది.

చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు..!


 

మరిన్ని వార్తలు