-

IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ వదిలేసింది.. కసితో సుడిగాలి శతకం

28 Nov, 2023 09:42 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌, రిలీజ్‌ ప్రక్రియ నవంబర్‌ 26తో ముగిసింది. అన్ని ఫ్రాంచైజీలు తాము వదిలేసిన, నిలుపుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలలాగే గుజరాత్‌ టైటాన్స్‌ కూడా పలువురు ఆటగాళ్లను రిలీజ్‌ చేసింది. 

కాగా, గుజరాత్‌ వేలానికి వదిలేసిన ఆటగాళ్ల జాబితాలోని ఓ బ్యాటర్‌ ఫ్రాంచైజీ తనను వదిలేసిందన్న కసితో చెలరేగిపోయాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో తన ప్రతాపాన్ని చూపించాడు. టైటాన్స్‌ తనను వదిలేసిన మరుసటి రోజే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. టైటాన్స్‌ తనను వదిలేసి తప్పు చేసిందని పశ్చాత్తాపపడేలా చేశాడు.

ఇంతకీ ఆ బ్యాటర్‌ ఎవరంటే.. 
గుజరాత్‌కు చెందిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 2024 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు వేలానికి వదిలేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాని ఉర్విల్‌ను టైటాన్స్‌ రిలీజ్‌ చేసింది. టైటాన్స్‌ తనను వద్దనుకుందన్న కసితో రెచ్చిపోయిన ఉర్విల్‌.. ఆ మరుసటి రోజే విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు.

ఉర్విల్‌ కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన శతకం (100) బాదాడు. ఈ శతకం లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రెండో వేగవంతమైన శతకంగా రికార్డైంది. 2018 తర్వాత తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఉర్విల్‌.. ఈ మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో విరుచుకుపడటం విశేషం.

ఇదిలా ఉంటే, అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. గుజరాత్‌ బౌలర్ల ధాటికి 35.1 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌.. ఉర్విల్‌ పటేల్‌ సెంచరీతో చెలరేగడంతో కేవలం 13 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

మరిన్ని వార్తలు