భీకర ఫామ్‌లో పడిక్కల్‌.. మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభణ | Sakshi
Sakshi News home page

భీకర ఫామ్‌లో పడిక్కల్‌.. మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభణ

Published Tue, Nov 28 2023 8:44 AM

Vijay Hazare Trophy 2023: Devdutt Padikkal In Incredible Touch, Scores 2 Half Centuries And A Century In 3 Matches - Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ దేశవాలీ వన్డే టోర్నీలో అతను మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌.. సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీల సాయంతో 258 పరుగులు చేశాడు. 

తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్‌ 69 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 117) చేసిన అతను.. దానికి ముందు జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు హాఫ్‌ సెంచరీతో (35 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిశాడు. 

కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. విధ్వత్‌ కావేరప్ప (3/25), కౌశిక్‌ (3/19), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (2/27), కృష్ణప్ప గౌతమ్‌ (2/32) ధాటికి 36.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అయూశ్‌ బదోని (100) ఒక్కడే మూడొంతుల స్కోర్‌ చేయడం​ విశేషం. 

అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన కర్ణాటక.. పడిక్కల్‌ (70) రాణించడంతో 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన మయాంక్‌ అగర్వాల్‌ (12) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మనీశ్‌ పాండే (28 నాటౌట్‌).. శరత్‌ (7 నాటౌట్‌) సహకారంతో కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌, సుయాశ్‌ శర్మ, లలిత్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Advertisement