Ind Vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్‌

24 Dec, 2023 13:55 IST|Sakshi
యశస్వి జైశ్వాల్‌

IND vs SA Test Series 2023: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌పై అంచనాలు పెంచుకోవద్దని భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ అన్నాడు. సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని.. గత ప్రదర్శన ఆధారంగా యశస్విపై ఆశలు పెట్టుకోవద్దని పేర్కొన్నాడు.

కాగా వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా యశస్వి జైశ్వాల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్‌తో తొలి మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్‌.. సెంచరీతో చెలరేగాడు.

అరంగేట్రంలోనే సెంచరీ
కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి 171 పరుగులు సాధించి అనేక రికార్డులు సృష్టించాడు. విండీస్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ అర్ధ శతకం(57)తో ఆకట్టుకున్న యశస్వి.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్బంగా మొత్తంగా 266 పరుగులతో సత్తా చాటాడు.

రెగ్యులర్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో ఆడటంతో ఓపెనర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదిలా ఉంటే.. యశస్వి టీమిండియాతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.  

సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. ఎందుకంటే
ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌ అనంతరం డిసెంబరు 26 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘వెస్టిండీస్‌.. సౌతాఫ్రికా పరిస్థితులు పూర్తి భిన్నమైనవి. సఫారీ పిచ్‌లపై భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. నిజానికి వెస్టిండీస్‌ పిచ్‌లు కాస్త ఉప ఖండపు పిచ్‌లను పోలి ఉంటాయి.

ప్రొటిస్‌ పేసర్లను ఎదుర్కోవడం కష్టం
కానీ సఫారీ గడ్డపై పేస్‌ దళం అటాకింగ్‌ను తట్టుకోవడం కష్టం. ముఖ్యంగా మార్కో జాన్సెన్‌, కగిసో రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్‌ వేసే బంతులను ఎదుర్కోవడం అత్యంత కష్టం.

యశస్వి ఫ్రంట్‌ ఫుట్‌, బ్యాక్‌ ఫుట్‌ షాట్లు అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. అయితే, సౌతాఫ్రికాలో అతడికి అంత ఈజీ కాదు. మంచి ఎక్స్‌పీరియన్స్‌ మాత్రం వస్తుంది. అతడు ఇంకా యువకుడు.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్‌. అతడిపై భారీగా అంచనాలు పెట్టుకోవద్దు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ సెంచరీ, డబుల్‌ సెంచరీ బాదాలని కోరుకోకూడదు’’ అని గంభీర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

చదవండి: Ind W vs Aus W: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సరికొత్త చరిత్ర

>
మరిన్ని వార్తలు