Virat Kohli: అక్కడున్నది కోహ్లి.. రాత్రికిరాత్రే వెళ్లలేదు.. పక్కా ప్లాన్‌తోనే!

24 Dec, 2023 11:18 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

Virat Kohli- India vs South Africa: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తిరిగి జట్టుతో చేరినట్లు సమాచారం. సౌతాఫ్రికాతో మంగళవారం నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు అతడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్‌-2023 తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

మెగా టోర్నీ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన ఈ రన్‌మెషీన్‌.. భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి లండన్‌లో సెలవులను ఆస్వాదించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌తో తిరిగి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు.

అకస్మాత్తుగా ఇండియాకు?
అయితే, దక్షిణాఫ్రికా నుంచి కోహ్లి అకస్మాత్తుగా తిరిగి భారత్‌కు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా.. బీసీసీఐ అనుమతి తీసుకుని అతడు ముంబైకి వచ్చాడని.. అందుకే ఇంట్రా స్వ్కాడ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడన్నది వాటి సారాంశం. 

అతడు విరాట్‌ కోహ్లి.. ఎంతో ప్లాన్డ్‌గా ఉంటాడు
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తమతో మాట్లాడుతూ స్పష్టతనిచ్చినట్లు న్యూస్‌18 తెలిపింది. ఈ మేరకు.. ‘‘విరాట్‌ కోహ్లి ఆ మ్యాచ్‌ ఆడటం లేదని మాకు ముందే తెలుసు.

అతడి ప్రణాళికలు, షెడ్యూల్‌ గురించి మేనేజ్‌మెంట్‌కు ముందుగానే సమాచారం ఇచ్చాడు. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల అప్పటికప్పుడు రాత్రికిరాత్రే తిరిగి వెళ్లిపోలేదు. అతడు విరాట్‌ కోహ్లి అన్న విషయం మనం మర్చిపోకూడదు.

ముందుగానే చెప్పి లండన్‌ వెళ్లాడు
తను ప్రణాళికబద్ధంగా ఉంటాడు. అందుకే లండన్‌ ట్రిప్‌లో ఉన్నపుడే ఈ విషయం గురించి మేనేజ్‌మెంట్‌తో చెప్పాడు. నిజానికి డిసెంబరు 15న కోహ్లి ఇండియా నుంచి సౌతాఫ్రికాకు బయల్దేరాడు.

అక్కడ 3-4 ట్రెయినింగ్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత బోర్డు అనుమతితో డిసెంబరు 19న కోహ్లి మళ్లీ లండన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చి తిరిగి టెస్టు జట్టుతో కలిసి సెంచూరియన్‌ మ్యాచ్‌కు సన్నద్ధమవుతాడు’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది.

సెంచూరియన్‌ వేదికగా తొలి టెస్టు
కాగా పేసర్లకు స్వర్గధామమైన సెంచూరియన్‌ పిచ్‌పై టీమిండియా- సౌతాఫ్రికాతో తొలి టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక సఫారీ గడ్డపై భారత్‌ ఇంతవరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదన్న విషయం తెలిసిందే.

మరోవైపు.. ఇప్పటికే గాయం కారణంగా పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టుకు దూరం కాగా.. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా వేలి నొప్పి వల్ల ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ జట్టుతో చేరాడు.

చదవండి: IPL 2024: ముస్తాబాద్‌ నుంచి ఐపీఎల్‌ దాకా.. సీఎస్‌కేకు ఆడే ఛాన్స్‌! 

>
మరిన్ని వార్తలు