Bismah Maroof: 'ఆసియా గేమ్స్‌ నుంచి తప్పుకొంటున్నా'.. పాక్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం

25 Jul, 2023 18:16 IST|Sakshi

పాకిస్థాన్ మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ బిస్మాహ్ మ‌రూఫ్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆసియా గేమ్స్(Asian Games 2023)లో ఆడనున్న పాక్‌ జట్టు నుంచి తాను తప్పుకుంటున్న‌ట్లు మంగళవారం ప్ర‌క‌టించింది. టోర్నీకి పిల్ల‌లను అనుమ‌తించ‌క‌పోవ‌డంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిస్మాహ్‌ మరూఫ్‌ తెలిపింది.  ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రికెట‌ర్లు త‌మ పిల్ల‌ల్ని వెంట తీసుకురావొద్దని ఆసియా గేమ్స్ నిర్వాహ‌కులు నిబంధన పెట్టారు. దీంతో రెండేళ్ల చంటిబిడ్డను వ‌దిలి వెళ్ల‌డం ఇష్టం లేని మరూఫ్ టోర్నీ నుంచి త‌ప్పుకుంది.

ఇక బిస్మాహ్ పాక్ ప్ర‌ధాన బ్యాట‌ర్ల‌లో ఒక‌రు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆమె పాక్‌ తరపున 108 వన్డేల్లో 2602 పరుగులతో పాటు 44 వికెట్లు, 108 టి20ల్లో 2202 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది. 2021 ఏప్రిల్‌లో  బిస్మాహ్‌ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం కోసం క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చింది.

మ‌ళ్లీ అదే ఏడాది డిసెంబ‌ర్‌లో మైదానంలో అడుగుపెట్టింది. 2022లో బిస్మాహ్ ప‌రుగుల వ‌ర‌ద పారించింది. పాక్ మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున ఆ ఏడాది వ‌న్డేలు, టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు కొట్టి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఒక్క సెంచ‌రీ లేకుండానే వ‌న్డేల్లో ఎక్కువ ప‌రుగులు చేసిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. 

''దురృష్ట‌వ‌శాత్తూ పాక్ జ‌ట్టు బిస్మాహ్ మ‌రుఫే సేవ‌ల్ని కోల్పోనుంది. పిల్ల‌ల్ని వెంట తీసుకురావొద్ద‌నే నియమం కార‌ణంగా ఆమె త‌న చిన్న పాప‌తో చైనాకు రాలేని ప‌రిస్థితి'' అని మ‌హిళ‌ల జ‌ట్టు హెడ్ తానియా మ‌ల్లిక్‌ పేర్కొంది. ఇక ఈ ఏడాది ఆసియా గేమ్స్ సెప్టెంబ‌ర్ 19 నుంచి 26 వ‌రకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది.

హ్యాట్రిక్ కొట్టేనా..?
ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్ జ‌ట్టుకు మంచి రికార్డు ఉంది. వ‌రుస‌గా రెండు సార్లు పాక్ ఆసియా గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. 2010లో చైనాలోని ఇంచియాన్‌లో, 2014లో ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన పోటీల్లో విజేత‌గా నిలిచింది. దాంతో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని భావిస్తోంది.

చదవండి:  వైరల్‌గా మారిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌.. ధోని నెలజీతం ఎంతంటే?

తమిళ సంప్రదాయ పద్ధతిలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్‌! ఆ విషాదం తర్వాత..

మరిన్ని వార్తలు