FIFA WC 2022: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'

29 Nov, 2022 16:02 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్‌-హెచ్‌లో సోమవారం ఘనా, దక్షిణ కొరియాల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఘనా జట్టు 3-2 తేడాతో సౌత్‌ కొరియాపై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. మహ్మద్‌ కుదుస్‌ రెండు గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించి ఘనా ఆశలను నిలపగా.. మరోపక్క సౌత్‌ కొరియా మాత్రం ఓటమితో వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించినట్లే.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓడిపోయామన్న బాధలో ఉన్న సౌత్‌ కొరియా కెప్టెన్‌ సన్‌ హ్యుంగ్‌ మిన్‌ ఏడుస్తూ తెగ ఫీలయ్యాడు. ఇలాంటి సమయంలో ఓదార్చాల్సింది పోయి అతని వద్దకు వచ్చిన ఘనా స్టాఫ్‌ సిబ్బంది తమ చేష్టలతో విసిగించారు. ఒకపక్క ఓటమి బాధలో సన్‌ హ్యుంగ్‌ ఏడుస్తుంటే.. ఘనా సిబ్బంలోని ఒక వ్యక్తి మాత్రం అతనితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.

ఇది గమనించిన తోటి స్టాఫ్‌ మెంబర్‌ వద్దని వారించినా వినకుండా సెల్ఫీ దిగాడు. ఇదంతా గమనించిన ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ ఘనా స్టాఫ్‌ సిబ్బందిని ట్రోల్‌ చేశారు. ''పాపం మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధలో అతను ఏడుస్తుంటే సెల్ఫీ ఎలా తీసుకుంటారు''.. ''సిగ్గుండాలి.. బాధలో ఉన్న ఆటగాడిని ఓదార్చాల్సింది పోయి ఇలా సెల్ఫీలు దిగడమేంటి.. చాలా అసహ్యంగా ఉంది'' అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక గ్రూప్‌ హెచ్‌ నుంచి పోర్చుగల్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించగా.. ఇక ఘనా తన చివరి మ్యాచ్‌ ఉరుగ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరిన పోర్చుగల్‌ మాత్రం సౌత్‌ కొరియాతో డిసెంబర్‌ 3న ఆడనుంది.

చదవండి: Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్‌ నాది'

>
మరిన్ని వార్తలు