German Open: సింధుకు ఊహించని షాక్‌.. సైనా కూడా అవుట్‌!

11 Mar, 2022 10:58 IST|Sakshi

జర్మన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ 

సింధు, సైనా నిష్క్రమణ

క్వార్టర్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్‌   

మ్యుహెమ్‌ అండరుహ్‌ (జర్మనీ): భారత స్టార్‌ షట్లర్లకు జర్మన్‌ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ కంగుతినగా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–16, 21–23, 21–18తో చైనాకు చెందిన లుగ్వాంగ్‌ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడు తూ పైచేయి సాధించాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21–19, 24–22తో లీ చిక్‌ యూ (హాంకాంగ్‌)పై గెలిచాడు.  

శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌కు సిసలైన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్‌ చాంపియన్, టాప్‌సీడ్‌ విక్టర్‌ అక్సెసెన్‌ (డెన్మార్క్‌)తో భారత స్టార్‌ తలపడనున్నాడు.

సింధు, సైనా అవుట్‌!
మహిళల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో  ఏడో సీడ్‌ సింధు 14–21, 21–15, 14–21తో జాంగ్‌ యిమన్‌ (చైనా) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్‌. అన్‌సీడెడ్‌ ప్రత్యర్థిపై ఒక గేమ్‌ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.  సుదీర్ఘకాలంగా ఫిట్‌నెస్‌ సమస్యలెదుర్కొంటూ కెరీర్‌ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది.

థాయ్‌లాండ్‌ స్టార్, ఎనిమిదో సీడ్‌ రత్చనోక్‌ ఇంతనొన్‌ 21–10, 21–15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జోడీ 23–21, 16–21, 21–14తో భారత్‌కే చెందిన ఇషాన్‌ భట్నాగర్‌–సాయిప్రతీక్‌ జంటపై గెలిచింది.

చదవండి: Novak Djokovic: నంబర్‌ 1 ర్యాంకు కోల్పోయావు.. అయినా నువ్వు మారవా! 

మరిన్ని వార్తలు